YSR Congress Crisis: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్లు ఆందోళనతో ఉన్నారు. పార్టీ ఇప్పట్లో బయటపడే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. కొన్ని విషయాల్లో అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు మారాలని కోరుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అయితే ఏడాది పాలనలో పూర్తిగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సొంత పార్టీలో జరుగుతున్న పరిస్థితులను ఆయన పట్టించుకోవడం లేదు. తప్పకుండా ఇది పార్టీకి డామేజ్ చేసే విషయమని సీనియర్లు ఆందోళనతో ఉన్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మహిళా ఓటర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన రెండు ఘటనలు పార్టీకి అంతులేని నష్టాన్ని చేకూర్చాయని.. అది అధినేత జగన్మోహన్ రెడ్డి గుర్తించలేని స్థితిలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని అధినేత..
అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) కొన్ని విషయాల్లో ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారు. పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. మరి ప్రజలు ఇంత ఘోరంగా ఎందుకు ఓడించారు అన్నది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దూకుడు తోనే ఈ పరిస్థితి ఎదురయ్యిందని మాత్రం ఒప్పుకోకపోవడం, వారిని నియంత్రించ లేకపోవడం పార్టీకి అంతులేని నష్టం జరిగింది. ఇంతటి ఓటమి ఎదురైనా గుణపాఠాలు మాత్రం నేర్వలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. కనీసం తమ పార్టీ నేతల వైఫల్య వ్యాఖ్యలను ఖండించలేకపోతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో దొర్లుతున్న తప్పిదాలను సరిచేసే ప్రయత్నం చేయడం లేదు. దీనికి తప్పకుండా మూల్యం ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Also Read: ఆ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్!
మహిళా రైతులపై అనుచితం..
కొద్ది రోజుల కిందట అమరావతి ( Amaravathi ) మహిళా రైతుల విషయంలో సొంత మీడియాలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు జర్నలిస్టులు. ఏకంగా ఆ ప్రాంత మహిళలను వేశ్యలతో పోల్చారు. సభ్య సమాజం తలదించుకునేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. కానీ దానిని వైసిపి నేతలు సమర్ధించుకున్నారే తప్ప ఖండించిన దాఖలాలు లేవు. అది పార్టీ పరంగా కూడా భారీ డ్యామేజ్ జరిగింది. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెనుముప్పుగా మారింది. ప్రజల్లోకి ఈ వ్యాఖ్యలు బలంగా వెళ్లాయి. ఓడిపోయినా సరే వీరు తీరు మార్చుకో లేదంటూ ఎక్కువమంది వ్యాఖ్యానించారు కూడా. ముఖ్యంగా మహిళల్లోకి ఈ వైఫల్యం బలంగా వెళ్ళింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలను కించపరిచే పార్టీగా ముద్రపడింది.
మహిళా నేతపై ఎందుకలా?
తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( vemareddy Prabhakar Reddy ) భార్య, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఓ మహిళా నేతపై అలా వ్యాఖ్యానించడం దారుణం. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను సైతం ఆందోళనకు గురిచేస్తుంది. ప్రశాంతి రెడ్డి మొన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ప్రభాకర్ రెడ్డి గౌరవప్రదమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి భార్య పై నోరు జారడం ఏమిటనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నుంచి వస్తున్న మాట. అయితే ఇంత జరుగుతున్నా.. జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవడం ముమ్మాటికి పార్టీని డ్యామేజ్ చేస్తుందని సీనియర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇది మామూలుగా కనిపిస్తున్నా.. ఎన్నికల నాటికి ఏదో రూపంలో నష్టం చేకూర్చడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.