YS Vivekanandareddy Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విచారణ వేగవంతం అవుతుందని అంతా భావించారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా టిడిపి కీలక భాగస్వామి కావడంతో.. ఇక కేసులో పురోగతి ఉంటుందని అంతా ఆశించారు. కానీ వంద రోజులు దాటుతున్నా వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో ఎటువంటి పురోగతి లేదు. ఈ తరుణంలో వివేకా కుమార్తె సునీత హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. తాజాగా సీఎం చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరారు. దీంతో ఈ కేసు మరోసారి తెరపైకి రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు సునీత. ఆ చెక్కును అందించే క్రమంలో చంద్రబాబును కలిశారు. పనిలో పనిగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రస్తావించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
* ఆ వ్యూహంతోనే సీఎంతో కలయిక
అయితే సునీత ఒక పద్ధతి, వ్యూహం ప్రకారం చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబై నటి వ్యవహారం ఇలానే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముంబైలో నమోదైన ఒక కేసును విత్ డ్రా చేసుకునేందుకు.. ఏపీలో ఆమెపై కేసు పెట్టివేధించారు.తప్పుడు కేసుతో రిమాండ్ కు పంపారు. దీనికి భయపడిన ఆమె ముంబైలో కేసు విత్ డ్రా చేసుకున్నారు. అయితే ఈ మొత్తం కేసు ఇప్పుడు బయటకు రావడం విశేషం. ఈ కేసులో సహకరించిన ఐపీఎస్ అధికారులు, పోలీస్ సిబ్బందిపై వరుసగా వేటుపడుతోంది. ఇప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సైతం కీలక చర్యలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
* సిబిఐ కి సహకరించలే
వాస్తవానికి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో అప్పట్లో కడప జిల్లాతో పాటు పులివెందులలో సైతం విచారణ కొనసాగింది. ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ సమయంలో రాష్ట్ర పోలీస్ శాఖ సహకారం అందించాలి. కానీ ఈ కేసు విషయంలో సిబిఐ కి పోలీస్ శాఖ సహకరించకపోగా.. బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. సిబిఐ విచారణ అధికారులకు సైతం రకరకాలుగా వెంటాడినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అప్పటి రాష్ట్ర పోలీస్ బాస్ తో పాటు ఉన్నతాధికారులు సైతం సహాయ నిరాకరణ చేసినట్లు తెలుస్తోంది.
* అవినాష్ అరెస్టు సమయంలో అలా
ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సిబిఐ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పోలీస్ శాఖ సహకరించాల్సింది పోయి.. సిబిఐ నియంత్రించేదాకా పరిస్థితి వచ్చిందంటే.. ఏ స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు సహకారం అందించారో అర్థమవుతోంది. అందుకే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటువేయనున్నట్లు తెలుస్తోంది. ముంబై నటి కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడిన సంగతి తెలిసిందే. వివేక హత్య కేసులో సైతం ఇదే మాదిరిగా సీనియర్లపై చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో ఆందోళనకు కారణమవుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ys vivekananda reddys murder case is likely to come to the fore once again
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com