YS Vivekananda Reddy Case: వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసులో సూత్రధారులు తప్పించుకున్నారా? సిబిఐ కొండను వెతికి ఎలుకను పట్టుకుందా? అసలు ఏం తేలింది సిబిఐ విచారణలో? ఎందుకీ గందరగోళం? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ చేతులెత్తేసింది. ఈ కేసులో కొత్తగా ఆధారాలు ఏవి దొరకలేదని.. ఇతరుల ప్రమేయంపై ఎటువంటి సాక్షాలు లేవని తేల్చేసింది. తుది చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఓ నలుగురు కిరాయి ముఠా ఈ ఘటనకు పాల్పడిందని చెప్పుకొస్తోంది. వైయస్ భాస్కర్ రెడ్డి సూత్రధారి అని పేర్కొంది. అయితే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అసలు సూత్రధారులు పట్టుబడలేదని బలంగా భావిస్తున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డిని సైతం విచారించాలని బలంగా కోరుతున్నారు. కానీ మరెవరిని విచారించే అవకాశం లేదని సిబిఐ చెబుతోంది.
* హై ప్రొఫైల్ కేసు
2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు. పైగా ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) తర్వాత అంతటి పెద్ద నేత కూడా ఆయనే. గత మూడు దశాబ్దాలుగా పులివెందుల ఆయన కంట్రోల్లోనే ఉండేది. చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది. అటువంటిది వివేకానంద రెడ్డి హత్య జరిగింది అంటే అది రాజకీయ కుట్ర కోణంలో ఉంటుందన్నది ప్రధాన అనుమానం. అయితే ఆయన మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలని భావించారు. అయితే ప్రధానంగా వైయస్ భాస్కర్ రెడ్డి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తొలుత. ఇప్పుడు సీబిఐ ఆయనే అసలు సూత్రధారి అని తేల్చింది. ఆయన స్వయాన కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి. ఇంతవరకు ఆయన తెర వెనుక మాత్రమే ఉండేవారు. ఎమ్మెల్యే కాదు.. ఎంపీ అంతకంటే కాదు. ఆయనే రాజకీయ ఆధిపత్యం లో భాగంగా హత్యకు పథకం వేసారని సిబిఐ చెబుతోంది. ఇక్కడే సునీత రెడ్డిలో అనుమానం. భాస్కర్ రెడ్డి రాజకీయ ప్రయోజనం కోసం హత్య చేయించారు అంటే అది ముమ్మాటికి అవినాష్ రెడ్డి కోసమే. అందుకే అవినాష్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని సునీత రెడ్డి చెబుతున్నారు. వీరికి పరోక్ష సహకారం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి చేశారన్నది ప్రధాన అనుమానం. ఎందుకంటే వైయస్ భాస్కర్ రెడ్డి భారతి రెడ్డికి సమీప బంధువు. అందుకే సునీత బలంగా కోరుతోంది వారి ప్రమేయంపై దర్యాప్తు చేయాలని..
* జగన్ స్పందన బాలేదు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి బలమైన ప్రతిపక్షంగా పార్టీని తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి. పైగా 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుపు అనే వాదన వినిపిస్తోంది. ఆ సమయంలో వివేకానంద రెడ్డి హత్య జరిగితే.. అన్న కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందించాలి? మా చిన్నాన్న ను పొట్టన పెట్టుకుంటారా? మీ అంతు తేలుస్తాం అన్నట్టు ఉండాలి. అదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చేతిలో సర్వాధికారాలు వచ్చాయి. అప్పటివరకు నారాసుర చరిత్ర అంటూ చంద్రబాబుకు ప్రమేయం ఉందని సొంత మీడియాలో చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి మీరు వేసిన సిఐడి విచారణ వద్దు సిబిఐ కావాలని కోరారు. పవర్ లోకి వచ్చాక సిబిఐ విచారణ అవసరం లేదన్నట్టు మాట్లాడారు. ఏకంగా న్యాయస్థానంలో కూడా తన వాదనలు వినిపించారు ప్రభుత్వం తరఫున. సొంత బాబాయ్ హత్య కేసు విచారణకు ఏమాత్రం సహకరించలేదు. సిబిఐ సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో ఏ 8 నిందితుడిగా పేరు చేర్చినప్పుడు ఆయన అరెస్టు కోసం ప్రయత్నం చేసింది సిబిఐ. అత్యున్నత దర్యాప్తు సంస్థ తేల్చినప్పుడు అరెస్టుకు సహకరించాలి. అందరి మాదిరిగానే చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం చేయలేదు. దీంతో ఆయన పాత్ర పై కూడా అనుమానాలు ప్రారంభం అయ్యేందుకు ఆయనే అవకాశం ఇచ్చారు.
* సిబిఐ చార్జ్ షీట్లో అస్పష్టత
సిబిఐ( Central Bureau of Investigation ) విచారణ సైతం అపసవ్య దిశగా కొనసాగింది. చార్జ్ షీట్ల మధ్య పొందుపరిచిన అంశాలు గందరగోళంగా మారాయి. సిబిఐ దర్యాప్తు ప్రారంభించి తొలి చార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు.. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు అని.. రాజకీయ కుట్ర ఉందని చెప్పుకొచ్చింది సిబిఐ. లోతైన దర్యాప్తు అవసరమని చెప్పింది. నిందితులు కేవలం పాత్రధారులు మాత్రమేనని.. సూత్రధారులు ఉన్నారని కూడా చెప్పింది. అటు తరువాత ఒకటో సప్లమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో హై ప్రొఫైల్ నిందితులు ఉన్నారని.. వారి విషయంలో దర్యాప్తు కొనసాగుతోందని.. విచారణకు సహకరించకుండా తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ అందులో చెప్పుకొచ్చింది. రెండో సప్లిమెంటరీ చార్జిషీట్లో డిజిటల్ అంశాలను, ఫోన్ సంభాషణలు అంటూ కొన్ని విషయాలను బయటపెట్టింది. దీంతో చాలా రకాలుగా క్లారిటీ వచ్చింది. మూడో సప్లిమెంటరీ చార్జ్ షీట్లో a7 నిందితుడిగా వైయస్ భాస్కర్ రెడ్డిని పేర్కొనగా.. ఏ 8 గా అవినాష్ రెడ్డిని చూపింది. అయితే ఆయన అరెస్టును మాత్రం చేయలేకపోయింది. ఇప్పుడు తుది చార్జ్ షీట్ లో మాత్రం భాస్కర్ రెడ్డి సూత్రధారి.. ఆ నలుగురు పాత్రధారులు అన్నట్లు తేల్చింది.
* సునీత అనుమానాలు అవే..
వైయస్ సునీత రెడ్డికి( y s Sunita Reddy) ఒకటే అనుమానం. తన తండ్రిని రాజకీయ కుట్ర కోణంలోనే హత్య చేశారనేది ఆమె బలంగా అనుమానిస్తున్నారు. భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే కాదు.. ఎంపీ కాదు. అటువంటప్పుడు ఆయన ఎందుకు హత్యకు దిగుతారు. కచ్చితంగా అది తన కుమారుడు అవినాష్ రెడ్డి కోసమే. అది కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డికి తెలుసు. వారి సహకారంతోనే తన తండ్రిని మట్టుపెట్టారని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఈ కేసు విషయంలో తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిని అడిగినప్పుడు.. ఈ కేసు నుంచి తప్పుకోవాలని ఆయన కోరినట్లు స్వయంగా సునీత రెడ్డి బయటకు వెల్లడించారు. పోనీ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సునీత రెడ్డికి ఏమైనా విభేదాలు ఉన్నాయి అంటే అది లేదు. ఆమె రాజకీయంగా పదవులు కోరుకుంటున్నారంటే అది లేదు. పైగా ఆమెను, ఆమె భర్తను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. సాక్షి మీడియాలో సునీత రెడ్డికి వ్యతిరేకంగా విపరీతమైన కథనాలు వచ్చాయి. చివరకు కుటుంబ వ్యవహారంతోనే ఈ హత్య జరిగినట్లు కూడా పేర్కొన్నారు. హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం, రాజకీయ ప్రత్యర్థులే చేశారని టిడిపి పై నెట్టడం, చేతిలోకి పవర్ వచ్చిన ఈ హత్య కేసు విషయంలో జాప్యం చేయడం, ఉద్దేశపూర్వకంగా తొక్కి వేసే ప్రయత్నం చేయడం, నిందితులుగా భావిస్తున్న వారిని వెనుకేసుకు రావడం, తన బాబాయి హత్యకు గురైతే నిందితులకు శిక్ష పడాలని జగన్ కోరుకోకపోవడం వంటి వాటితో సూత్రధారుల విషయంలో అనుమానాలు పెరిగాయి. కేవలం నిందితులను వెనుకేసుకొస్తున్నారని జగన్మోహన్ రెడ్డి పై అపవాదు ఉంది. సునీత లో కనిపిస్తున్న లోటు కూడా అదే. కేవలం నలుగురు కిరాయి ముఠాతో అంతమొందించడం అంత ఈజీ కాదని.. దీని వెనుక అసలైన రాజకీయ కుట్రను సిబిఐ కనిపెట్టలేకపోయిందన్నది సునీతలో ఉన్న ఆవేదన. అంతకుమించి ఏమీ కాదు.