YS Sunitha
YS Sunitha : వైయస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య జరిగి ఆరేళ్లు పూర్తవుతోంది. 2019 మార్చి 15న పులివెందులలో తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. కానీ ఇంతవరకు ఆ కేసు కొలిక్కి రాలేదు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మరో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్, ఆపై మాజీ మంత్రి, మాజీ ఎంపీ కూడా. అటువంటి నేత హత్య విషయంలో నిగ్గు తేల్చలేక పోయింది దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన దర్యాప్తు సంస్థ సిబిఐ. ఏపీ రాజకీయాల్లోనే కీలక కుటుంబంలో వివేకానంద రెడ్డి ఒక సభ్యుడు. కానీ ఆ హత్యను చేధించలేక పోయింది సిబిఐ. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా.
Also Read : కూటమి నెక్స్ట్ స్టాప్ కడప.. ఎస్పీని సునీత అందుకే కలిశారా?
* సిబిఐ విచారణ అవసరంలే..
అయితే ఈ కేసు విషయంలో న్యాయపోరాటం చేస్తున్నారు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత( Sunita) . 2019 ఎన్నికలకు ముందు ఈ ఘటన జరిగింది. అప్పట్లో టిడిపి అధికారంలో ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కొనసాగుతోంది. తొలుత ఆత్మహత్య అన్నారు. తరువాత హత్యగా తేల్చారు. రాజకీయ ప్రత్యర్థులే ఈ హత్య చేశారని సంచలన ఆరోపణలు చేశారు. సిఐడి విచారణ వద్దు సిబిఐ విచారణ కావాలని కోరారు. అయితే ఈ ఘటన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి తెచ్చి పెట్టింది. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేస్ పూర్తిగా రివర్స్ అయ్యింది. సిబిఐ విచారణ కావాలని కోరిన జగన్మోహన్ రెడ్డి.. తరువాత ఆ అవసరం లేదని తేల్చేశారు.
* గత ఐదేళ్లుగా న్యాయపోరాటం
గత ఐదేళ్లుగా కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగింది. కానీ దానిని అడ్డుకున్నారు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. అయినా సరే కేసు కొలిక్కి రాలేదు. కూటమి అధికారంలోకి రావడంతో తప్పకుండా కదలిక వస్తుందని భావించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి మీడియా ముందుకు వచ్చారు సునీత. హత్య జరిగి ఆరేళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివేక వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కనీసం సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాకపోవడం పై వాపోయారు. నిందితుల్లో ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన వారంతా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ తిరిగి దర్యాప్తు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. న్యాయం కోసం తమ పోరాటం ఆగదని.. చివరి వరకు ప్రయత్నిస్తామని సునీత స్పష్టం చేశారు.
* సిబిఐ విఫలం
అయితే ఈ కేసు విచారణ పూర్తి చేయడంలో సిబిఐ( Central Bureau of Investigation ) విఫలం అయింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిబిఐ విచారణకు సహాయ నిరాకరణ ఎదురైంది. దీంతో అడుగు ముందుకు పడలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందని అంత ఆశించారు. కానీ ఇప్పటివరకు దర్యాప్తు పునః ప్రారంభం కాలేదు. అయితే తాజాగా సునీత మాటలు చూస్తుంటే దర్యాప్తు ప్రారంభం అవుతుందన్న ఆశాభావం కనిపిస్తోంది. అయితే కూటమి ఎట్టి పరిస్థితుల్లో వదలదని.. వచ్చే ఎన్నికల నాటికి ఇదో ప్రచార అస్త్రంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోందని.. ఎన్నికల నాటికి తప్పకుండా ఈ కేసులో నిందితులకు శిక్ష పడుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : ఏపీ హోం మినిస్టర్ అనితతో వైఎస్ సునీత.. జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?