YS Sunitha: కూటమి ప్రభుత్వం తర్వాత టార్గెట్ ఎవరు? ఇప్పటికే సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు పర్వం కొనసాగుతోంది. మరోవైపు వైసీపీకి మద్దతుగా నిలిచిన సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రీ రెడ్డి లాంటి సెలబ్రిటీలను సైతం ఏపీ పోలీసులు వదలట్లేదు. మరోవైపు ఈ ముగ్గురిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది కేసులు నమోదవుతుండగా.. అదే స్థాయిలో అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అన్న టాక్ వినిపిస్తోంది. అయితే అందరి వేళ్లు కడప జిల్లా వైపు చూపిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆయన పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ఇచ్చిన కంటెంట్ తోనే వైఎస్ విజయమ్మ,షర్మిల, సునీతలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు వర్ర రవీందర్ రెడ్డి పోలీస్ విచారణలో తేల్చి చెప్పారు. దీంతో రాఘవరెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన దొరికితే అవినాష్ రెడ్డి పాత్ర పై విచారణ చేపట్టే అవకాశం ఉంది. అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని కూడా తెలుస్తోంది.
* కూటమి పెద్దలను కలిసిన సునీత
మరోవైపు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పట్టు బిగిస్తున్నారు. తన తండ్రిని అవినాష్ రెడ్డి చంపించాడని ఇప్పటికే ఆరోపణలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె వరుసగా పోలీస్ అధికారులను కలుస్తున్నారు. తొలుత రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను కలిశారు.తన తండ్రి మరణం పై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.సీఎం చంద్రబాబును సైతం కలిసి కేసు పురోగతి విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు.తాజాగా కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిసి కీలక చర్చలు జరిపారు. తన తండ్రిని చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
* వ్యూహాత్మకంగా ప్రభుత్వం
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టింది.అదే సమయంలో వైసీపీ నేతలపై ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇప్పటికే లోకేష్ రెడ్ బుక్ పై కూడా చర్చ నడుస్తోంది. అయితే తరువాత టార్గెట్ అవినాష్ రెడ్డి అని తెలుస్తోంది. ఒకవైపు సోషల్ మీడియా కేసు
.. మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసును తెరపైకి తెచ్చి అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన దొరికిన మరుక్షణం అవినాష్ రెడ్డి ని సైతం అదుపులోకి తీసుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.