YS Sunitha: వైఎస్ వివేకా కుమార్తె సునీత యుద్ధం ప్రకటించారు. ఇప్పటివరకు ఆమె తండ్రి హత్యపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఇకపై ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. తన తండ్రిని హత్య చేసిన నిందితులు, దోషులు, అనుమానితులు, పాత్రధారులు, తెర వెనుక సహాయం అందించిన వారు.. ఇలా అన్నింటిపై స్పష్టతనిచ్చారు. నేరుగా ఢిల్లీ వెళ్లి విలేకరుల సమావేశం ఎదుట ఫుల్ క్లారిటీగా చెప్పేశారు. జగన్ కు మరోసారి ఓటు వేయొద్దని కూడా ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సునీత కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.
గత ఐదేళ్లుగా సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేశారు కూడా. సిబిఐ చురుగ్గా పనిచేసే కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర గురించి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని సైతం అరెస్టు చేసింది. అవినాష్ రెడ్డి అరెస్టు విషయానికి వచ్చేసరికి మాత్రం సిబిఐ వెనుకడుగు వేసింది. రాష్ట్ర పోలీస్ శాఖ సహకరించలేదని తేలింది. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు.. బెయిల్ లభించేందుకు అవసరమైన సాయం అందింది అన్న అనుమానాలు ఉన్నాయి. అటు కేసు క్లోజ్ చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం తీర్పునకు కూడా అతీ గతీ లేకుండా పోయింది. ఈ తరుణంలోనే వివేక కుమార్తె సునీత న్యాయ పోరాటంతో పాటు ప్రజాక్షేత్రంలో పోరాడాలని నిర్ణయించుకున్నారు.
సాధారణ హత్య కేసును నాలుగు ఐదు రోజుల్లో నిర్ధారించే పోలీసులు, దర్యాప్తు సంస్థలు వివేక హత్య కేసును ఐదేళ్ల అవుతున్నా ఛేదించలేకపోవడం ఏమిటని సునీత ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతవారే వివేకాను వెన్నుపోటు పొడిచారని.. ఆయన ఓటమికి పనిచేశారని.. తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారని గమనించి దారుణంగా హత్య చేశారని సునీత ఆరోపించారు. అచ్చం సినిమాల్లో పాత్రధారులు గానే వివేక హత్యలో నిందితులు నటించారని.. వివేక మృతదేహం వద్దకు వచ్చి అవినాష్ రెడ్డి బాధపడ్డారని.. పెదనాన్న నాకోసం ప్రచారం చేశారని చెప్పుకొచ్చారని సునీత గుర్తు చేశారు. అసలు మా నాన్నను గొడ్డలితో చంపారని జగనన్నకు ఎలా తెలుసునని ప్రశ్నించారు. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి,అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని.. వారిద్దరినీ జగన్ రక్షిస్తున్నారని.. వంచనకు,మోసానికి పాల్పడ్డారని.. అందుకే ఈసారి జగన్ కు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.
జగన్ ను నమ్మి మోసపోయానని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. మాట మీద నిలబడతా, విశ్వసనీయత అంటూ చెబుతుంటారని.. కానీ ఈ చెల్లికి ఇచ్చిన మాటను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించలేమని.. అందుకే జగన్ ను కలిసినప్పుడు నాకు ఆయనపై అనుమానం రాలేదు అన్నారు. ఈ హత్య కేసులో 8 మంది పేర్లు బయటకు వచ్చాయని.. ఇంకా రాని పేర్లు చాలా ఉన్నాయని… జగన్ పై విచారణ చేపట్టాలని కూడా సునీత డిమాండ్ చేశారు. జగనన్న కేసులు వల్లే మా నాన్న హత్య కేసును సాగదీస్తున్నారంటూ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే వివేక హత్య కేసు విషయంలో సునీత ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలని భావిస్తుండడం విశేషం.