YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని షర్మిల బయటపెట్టారు. శస్త్ర చికిత్స చేయించుకున్నానని.. ప్రస్తుతం కోలుకుంటున్నానని ఆమె ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విషయాన్ని ఆమె బయటపెట్టారు. ఆస్పత్రి బెడ్ మీద పడుకుని ఉన్న ఫోటోను ఆమె తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు
“ఇటీవల నాకు పొత్తికడుపు సంబంధిత సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది. వేగంగా కోలుకుంటున్నాను. ఈ విషయాన్ని మీ అందరితో చెప్పడానికి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. నా మీద శ్రద్ధ చూపిన అందరికీ ధన్యవాదాలు. ఈ సమయంలో నాకు అండగా ఉన్నారు. నాకోసం ప్రార్థన చేశారు. మీ అందరికీ కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు.. కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు” అంటూ షర్మిల ఒక పోస్ట్ చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. దేశంలో నీట్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ షర్మిల మీడియా ముందుకు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రభుత్వాన్ని.. జాతీయస్థాయిలో అధికార ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ఆందోళనలు నిర్వహించలేదు. దీంతో షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం జరుగుతున్నారా అనే వ్యాఖ్యలు కూడా మొదలయ్యాయి. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగాయి. అయితే ఆమె అనారోగ్య వల్ల ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారని.. అందువల్లే బయటికి రాలేదని తెలిసింది. షర్మిల అధికారికంగా ప్రకటన చేయడంతో.. ఇన్ని రోజులపాటు జరిగిన చర్చ ముగిసిపోయింది.
అయితే సొంత సోదరి అనారోగ్యానికి గురై ఆస్పత్రి బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా జగన్ పరామర్శించలేదు. రౌడీషీటర్ సాయి కృష్ణ చనిపోయినప్పుడు.. గంజాయి బ్యాచ్ ను ఏపీ పోలీసులు కొట్టినప్పుడు.. ఇంకా రకరకాల కేసులు ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన వారిని జగన్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయి కృష్ణ కుటుంబానికి నగదు సాయం కూడా చేశారు. చివరికి ఒక మనిషిని చంపిన సిదిరి అప్పలరాజు కుమారుడికి అండగా ఉంటానని ప్రకటించారు. కానీ సొంత సోదరి ఇలా ఆస్పత్రి బెడ్ మీద పడుకొని ఉంటే కనీసం పరామర్శించలేదని టిడిపి నేతలు అంటున్నారు. సొంత చెల్లికి న్యాయం చేయలేనివాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.







