YS Jagan Pulivendula Tour: ఇది ఒరకటితో పోలిస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డిలో( Y S Jagan Mohan Reddy ) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా సొంత నియోజకవర్గ పులివెందులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు స్పష్టం అవుతుంది. మొన్నటి పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో ఎదురైన పరిణామాలను జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. అంతకంటే ముందే శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను గుర్తుచేసుకొని ముందస్తు జాగ్రత్తలు పడుతున్నారు. అక్కడి ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనెల 26న మరోసారి పులివెందుల వెళ్ళనున్నారు. వరుసగా మూడు రోజులపాటు అక్కడే గడపనున్నారు. అయితే గతంలో పులివెందుల లాంటి నియోజకవర్గంలో వైయస్ కుటుంబ సభ్యులే కథ నడిపించేవారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తో పాటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో.. పులివెందుల నియోజకవర్గ ముఖం చూడడం అంతంత మాత్రమే.
రాష్ట్రస్థాయి నేతలకు కష్టం..
అయితే ప్రజల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మరోవైపు రాజకీయాల తీరు కూడా మారింది. ఎందుకంటే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి.. ప్రజల మధ్య ఉండనక్కర్లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి తెచ్చుకునేందుకు వ్యాపారాలు చేస్తున్నవారు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో దీనిపై స్పష్టమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల విషయంలో రాజకీయ పార్టీల నేతల ఆలోచన కూడా మారింది. అయితే ఈ విషయంలో రాష్ట్రస్థాయి రాజకీయాలు చేసే నేతలు అతీతం. వారి నియోజకవర్గాలపై ప్రత్యర్థి పార్టీల ఫోకస్ ఉంటుంది. నిత్యం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.
కుప్పంలో సరి చేసుకున్న చంద్రబాబు..
2019లో రాష్ట్రస్థాయిలో దెబ్బతిన్నారు చంద్రబాబు( CM Chandrababu). అదే పరిస్థితి సొంత నియోజకవర్గ కుప్పంలో కూడా కనిపించింది. గణనీయంగా మెజారిటీ తగ్గింది. ఆ తరువాత వచ్చిన జడ్పిటిసి, ఎంపీటీసీ లతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అక్కడ దెబ్బతింది. పరిస్థితిని గమనించారు చంద్రబాబు. నిత్యం కుప్పం నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ అక్కడి ప్రజలను కన్వెన్షన్ చేయగలిగారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిత్య పర్యటనలు చేస్తూ అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. చంద్రబాబుతో పాటు కుటుంబం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేసరికి కుప్పం ప్రజలు సంతృప్తి చెందారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చారు.
వారిపై ఆధారపడకుండా..
అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ది అదే పరిస్థితి. అప్పట్లో వైయస్ అవినాష్ రెడ్డి( Avinash Reddy), ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పులివెందుల బాధ్యతలు తీసుకునేవారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి అన్ని రకాల బాధ్యతలు చూసేవారు. అయితే మొన్నటి పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్త పడుతున్నారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పై ఆధారపడకుండా తానే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. 26 నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గంలోనే ఉండనున్నారు. చివరకు సామాన్యుల వివాహాలకు సైతం హాజరయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డారంటే.. ఆయన ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారో అర్థం అవుతుంది.