YS Jagan Mohan Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని ( Jagan Mohan Reddy)అరెస్ట్ చేస్తారా? మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్ట్ ఆయనదేనా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అనుమానంలో నిజం ఉందా? అంతటి సాహసం చంద్రబాబు చేస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సెంటిమెంట్ అనే ప్రాతిపదికన ఏపీ రాజకీయాలు జరుగుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ అకారణంగా జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేయడంతోనే ఆయనపై ప్రజల్లో సానుభూతి వ్యక్తం అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటయింది. అధికారంలోకి రాగలిగింది. మొన్నటికి మొన్న చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టడం కూడా సింపతి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి కూటమి గెలుపునకు కారణమైంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా? అనే ప్రశ్న వినిపిస్తోంది.
* కుదిపేస్తున్న మద్యం కుంభకోణం..
ప్రస్తుతం మద్యం కుంభకోణం( liquor scam) ఏపీలో కుదిపేస్తోంది. ఈ కేసులో వరుసుగా కీలక వ్యక్తుల అరెస్టులు జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫుల్ ఫోకస్ పెట్టింది. సిఐడి ప్రాథమిక విచారణ చేపట్టింది. కీలక ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారుల పేర్లు బయటపడ్డాయి. దీంతో అరెస్టుల పర్వం కూడా ప్రారంభం అయింది. ఇప్పటికే 8 మంది వరకు అరెస్ట్ అయ్యారు. తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డి ది అని తెగ ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
* వరుస అరెస్టులతో
మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి ( Raj Kashi Reddy ) ఉన్నారు. ఇదే విషయాన్ని ఇదే కేసులో ఏ 5 గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనకు నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యారు. ఆధారాలతో పాటు కీలక వాంగ్మూలం కూడా ఇచ్చారు. రాజ్ కసిరెడ్డి తో పాటు ఆయన ప్రధాన అనుచరుడు అరెస్ట్ అయ్యారు. అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఏపీ బేవరేజెస్ ఎండిగా పనిచేసిన వాసుదేవ రెడ్డి సైతం అరెస్టయ్యారు. ఇటీవల వైసిపి హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ వరుస కీలక వ్యక్తులు అరెస్టు కావడంతో తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అని తెగ ప్రచారం జరుగుతోంది.
* వైసీపీని నిర్వీర్యం చేయాలని..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఇంకా నాలుగేళ్ల పాలన ఉంది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బదనం చేస్తేనే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అవుతుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా మరోసారి ఆయన అవినీతిని బయట పెట్టవచ్చు అని కూటమి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు ముహూర్తం ఖరారు చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు కడపలో మహానాడు జరగనుంది. మహానాడుకు ముందే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారని.. తద్వారా టిడిపి క్యాడర్లో ఫుల్ జోష్ వస్తుందని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డిని అంత త్వరగా అరెస్టు చేయరని.. ముందు చుట్టూ ఉన్న నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తారని మరో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.