Y S Jagan Mohan Reddy : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఈనెల నాలుగున నాటికి ఏడాది పూర్తవుతుంది. జూన్ 12న కూటమి అధికారం చేపట్టింది. అయితే ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. అందుకే కూటమికి ఫలితాలు వచ్చిన జూన్ 4న వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆరోజున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. అయితే ఏడాది కూటమి పాలన ను అటుంచితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు విపక్ష నేతగా సక్సెస్ అయ్యారు అన్నది ఇప్పుడు ప్రశ్న. ఆయనకు ప్రతిపక్ష హోదా రాలేదు. అయినా సరే ఒక పార్టీ అధినేతగా.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి కావడంతో.. ఆయన పనితీరు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏడాదిలో ఆయన ప్రజా సమస్యలపై పోరాటం చేసే ప్రతిపక్ష నేతగా ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయారన్న విమర్శ ఉంది. అయితే దారుణ పరాజయం నుంచి బయటపడి పార్టీని లైన్లోకి తీసుకురావడంలో మాత్రం ఎంతో కొంత సక్సెస్ అయినట్టు కనిపించారు.
* అదో విలక్షణ తీర్పు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో( general elections) ఏపీ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. టిడిపి కూటమికి ఏకంగా 164 సీట్లు కట్టబెట్టారు. అప్పటివరకు అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. విపక్ష హోదా లేని నేతగా జగన్ ని ఉంచారు. జగన్ పొలిటికల్ కెరీర్లో ఇదో వింత అనుభవం కూడా. అయితే 2014 నుంచి 2019 మధ్య విపక్ష నేతగా ఉండేటప్పుడు జగన్ దూకుడుగా ఉండేవారు. ఆ దూకుడే 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలిగింది. అయితే మునుపటి దూకుడు జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కనిపించడం లేదు. ఇది ముమ్మాటికి ఆయనతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్. అయితే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని ముందుగానే అస్త్ర సన్యాసం చేశారు జగన్మోహన్ రెడ్డి. శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన సమయంలో కూడా తడబడ్డారు. గత అనుభవాల దృష్ట్యా తనకు దారుణ అవమానాలు ఉంటాయని భావించి ఏకంగా అసెంబ్లీని బాయ్ కట్ చేశారు. అది మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డికి మైనస్ గా మారింది.
Also Read : మోడీ–జగన్ సంబంధానికి బీటలు.. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సరికొత్త చర్చ
* కనీసం చంద్రబాబు మాదిరిగా కాకుండా
2019 ఎన్నికల్లో చంద్రబాబు( CM Chandrababu) నేతృత్వంలోని టిడిపి దారుణ పరాజయం చవిచూసింది. అయితే నాడు కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెట్టారు చంద్రబాబు. తొలినాళ్లలో గట్టిగానే పోరాటం చేశారు. వైసీపీ సభ్యుల నుంచి హేళనలు, విమర్శలను తట్టుకున్నారు. ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేశారు. అయితే చంద్రబాబు కుటుంబం పై వ్యక్తిగత దాడి చేయడంతో తీవ్ర అవమానంగా భావించారు. మళ్లీ సభలో సీఎంగానే అడుగు పెడతానని శపధం చేశారు. అయితే చంద్రబాబు అవమానాలను ఎదుర్కొన్న తీరు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అప్పట్లో ఆయన శాసనసభను బహిష్కరించినా తప్పు పట్టిన వారు తక్కువ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ప్రారంభంలోనే ఆయన శాసనసభను బహిష్కరించారు. అయితే కేవలం వైసీపీ హయాంలో ప్రత్యర్థులను టార్గెట్ చేసుకున్నారు.. అదే ఫార్ములా ఇప్పుడు తనపై అప్లై చేస్తారని తెలిసి జగన్ శాసనసభను బహిష్కరించారని ప్రజలు ఒక అంచనాకు వచ్చారు. జగన్ తీరును తప్పు పడుతున్న వారే అధికంగా ఉన్నారు.
* ప్రజల్లోకి వచ్చింది తక్కువ..
ఈ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రజల్లోకి వచ్చింది చాలా తక్కువ. ఎక్కువ సమయం బెంగళూరులోని ఎలహంకా ప్యాలెస్ లోనే గడిపేవారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గడప దాటేవారు కాదన్న విమర్శలు ఉండేవి. ఇప్పుడు మాత్రం బెంగళూరు కే పరిమితమైపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి కంటే ముందే జిల్లాల పర్యటనకు వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప.. ప్రజల్లోకి మాత్రం రాలేకపోయారు. పార్టీ శ్రేణుల్లో ఇది నిరాశ నింపుతోంది. మరోవైపు పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్ళిపోతున్న నిలువరించే ప్రయత్నం జరగలేదు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి మైనస్ గా మారింది. మొత్తానికైతే కూటమి ఏడాది పాలనను తప్పు పడుతున్న జగన్మోహన్ రెడ్డిని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం మార్కులు వేయడం లేదు. తొలి ఏడాది విపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నిరాశే మిగిలింది.