YS Jagan News: రాజకీయాల్లో కొందరికి వేగంగా అవకాశాలు దొరుకుతాయి. కానీ కొందరే నిలబడగలరు. తమకంటూ ఒక రాజకీయ ముద్ర చూపించుకోగలరు. గతంలో మంత్రిగా పదవి చేపడితే ఆ జిల్లా మొత్తం పట్టు చిక్కేది. కానీ వైసీపీ వచ్చాక పరిస్థితి లేదు. మంత్రి అంటే మంత్రి. తనవరకు దర్పం చూపించుకోవచ్చు కానీ.. జిల్లా మొత్తం ప్రభావం చూపే అవకాశమే లేదు అక్కడ. అయితే కొందరు నేతల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు. అటువంటి వారిలో ఉత్తరాంధ్రలో ధర్మాన, బొత్స ఫ్యామిలీలు. చిత్తూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ. వారి నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఆ కుటుంబాలు తప్ప రాజకీయాలు చేయలేవు టిడిపికి వ్యతిరేకంగా. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబానికి తగ్గట్టు డాక్టర్ అప్పలరాజు కు మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. విజయనగరంలో బొత్సతో పాటు రాజన్న దొరకు, పుష్పశ్రీవాణికి అవకాశం కల్పించారు. డిప్యూటీ సీఎం హోదా కూడా ఇచ్చారు. అయితే ఎవరికి ఇచ్చిన ఐదేళ్లపాటు ధర్మాన ఫ్యామిలీకి, బొత్స కు అవకాశం ఇవ్వడం తప్పనిసరి అయింది.
ఎంతోమందికి స్థానచలనం..
రాష్ట్రంలో మిగతా వైసీపీ మంత్రులకు నియోజకవర్గాలను మార్చేశారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). ఎన్నికలకు ముందు.. తరువాత వారికి స్థానచలనం కల్పించారు. అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు నుంచి నరసరావుపేటకు షిఫ్ట్ చేశారు. విడతల రజనీకి అయితే చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు పంపించారు. జోగి రమేష్ ను అయితే పెడన నుంచి పెనమలూరు పంపించారు. ఆదిమూలపు సురేష్ ను అయితే ఎర్రగొండపాలెం నుంచి కొండేపి పంపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇలా మంత్రులను సైతం పంపించగలరు. కానీ ఉత్తరాంధ్రలో ఆ రెండు జిల్లాల్లో మాత్రం పంపించలేకపోయారు.
జిల్లాలపై ప్రభావం తక్కువ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే వారు. కానీ డమ్మీలు అనే పరిస్థితి చాలా మంది విషయంలో ఉంది. ధర్మాన ఫ్యామిలీ( dharmana family ) లేకుండా శ్రీకాకుళంలో రాజకీయాలు చేయలేరు. బొత్స లేకుండా విజయనగరంలో అడుగుపెట్టలేరు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి అదే. అయితే ఈ స్థాయి నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తక్కువ. మంత్రి పదవులు చేపట్టారు కానీ ఒక్కరు కూడా జిల్లాలపై ప్రభావం చూపలేరు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ధర్మాన ప్రసాదరావు పూర్తిగా మౌనం పాటించారు. అయినా సరే ఆయన కోసం వెయిటింగ్ తప్పలేదు. ఇప్పుడు ఆయన క్రియాశీలకం కావడంతో వైసిపి ఊపిరి పీల్చుకుంది. బొత్స పరిస్థితి కూడా అదే. ఆయనకు ఖాళీగా ఉంచడం ఇష్టం లేక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆపై మండలి లో వైసీపీ పక్ష నేతగా ఛాన్స్ కల్పించారు.
ఆ జిల్లాల జోలికి పోవడం లేదు..
ప్రస్తుతం వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తరువాత ఎవరు అంటే మాత్రం ఉత్తరాంధ్ర నుంచి బొత్స, ధర్మాన ఫ్యామిలీ మాత్రమే కనిపిస్తోంది. మరోవైపు రాయలసీమ నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు మిస్ అయితే జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని ఊహించలేము. అందుకే మిగతా జిల్లాల్లో అనేక ప్రయోగాలు చేస్తున్నారే కానీ ఈ జిల్లాల జోలికి మాత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్లడం లేదు. ఒకవేళ వారి జోలికి వెళ్తే పొలిటికల్ గా జరిగే డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే వారి జోలికి వెళ్లడం లేదు సరి కదా.. ఆ జిల్లాలను వారికే రాసి ఇచ్చేశారు.