https://oktelugu.com/

YS Jaganmohan Reddy : ఫైట్ షురూ చేసిన జగన్.. పాలన ఫ్లాపులే టార్గెట్.. బాబు ఎలా కాచుకుంటాడు?

ఎన్నికల్లో ఏపీ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన అధికార వైసీపీని మట్టి కరిపించారు. దారుణ ఓటమితో వైసిపి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. ఇటువంటి సమయంలో వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 3, 2024 / 10:29 AM IST

    YS Jaganmohan Reddy

    Follow us on

    YS Jaganmohan Reddy :  వైసీపీ అధినేత దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వైసీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అంతర్గత సమావేశాలకు జగన్ పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. పార్టీ అనుబంధ సంఘాలతో ఇంట్రాక్టివ్ అవుతున్నారు. వారితో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ధైర్యం నూరిపోసి కూటమి ప్రభుత్వంపై పోరాడేలా సంసిద్ధులుగా చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలంతా గుడ్ బై చెబుతున్నారు. మరికొందరు పార్టీ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. సీనియర్లు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. పరిస్థితి చూసి నిర్ణయం తీసుకుందామని చాలామంది భావిస్తున్నారు. కూటమి పార్టీల నుంచి ఆహ్వానం లేకపోయినా.. చాలామంది వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీ శ్రేణులతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

    * జగన్ సీఎం గా ఉంటేనే సంక్షేమమట
    కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపిస్తున్నారు. అయితే దీనిని తిప్పి కొడుతున్నారు జగన్. జగన్ అనేవాడు సీఎం సీట్ లో ఉంటే సంక్షేమ పథకాలు కొనసాగేవని.. ప్రజలకు మంచి జరిగేదని గుర్తు చేశారు. అమ్మ ఒడి ఆగింది.. ఫీజు రీయింబర్స్మెంట్ ఆగింది.. రైతు భరోసా ఆగింది… ఆరోగ్య శ్రీ ఆగింది.. ఇలా అన్ని పథకాలు మూలకు చేరాయని చెబుతున్నారు జగన్. అబద్ధాలు, మోసాలతో కాలం కరిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తన హయాంలో అమలైన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారు. నాలుగు నెలల కూటమి పాలన దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పుకొస్తున్నారు.

    * కష్టించే వారికి గుర్తింపు
    పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్నవారే తనవారని.. వెళ్లిపోయిన వారు తన వారు కాదని గుర్తు చేస్తున్నారు జగన్. 2029 నాటికి వైసిపికి పూర్వ వైభవం ఖాయమని తేల్చి చెబుతున్నారు. కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటానని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. పోరాడితే కేసులు తప్ప మరేం చేయలేరని కూడా తేల్చి చెబుతున్నారు. మీ వెంట నేనుంటానని భరోసా ఇస్తున్నారు. అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు కీలక ఆదేశాలు ఇచ్చారు జగన్. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలు చెబుతూనే.. భవిష్యత్తులో అండగా నిలుస్తానని వారిలో ఒక రకమైన ధైర్యం నూరిపోస్తున్నారు.

    * క్లిష్ట సమయంలో
    ప్రస్తుతం వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు కేసులు, మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. అయితే ఇదే నిర్ణయం కొనసాగితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని జగన్ భావించారు. తొలి మూడు నెలలు అంతర్గత సమావేశాలకు పరిమితమైన జగన్.. ఇప్పుడు పార్టీ శ్రేణులతో వరుసగా సమీక్షలు జరుపుతున్నారు. జిల్లాలో పార్టీ స్థితిగతులను తెలుసుకుంటున్నారు. సంక్రాంతి తరువాత ప్రజల్లోకి వస్తానని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం తప్పకుండా వైఫల్యం చెందుతుందని.. అందుకే పార్టీ శ్రేణులు పోరాటానికి సిద్ధంగా ఉండాలని.. భవిష్యత్తు మనదేనంటూ తేల్చి చెబుతున్నారు. మొత్తానికి అయితే వైసీపీ అధినేత కూటమి ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించారు. తన సైన్యాన్నిసర్వసిద్ధం చేస్తున్నారు. అయితే వైసీపీ శ్రేణులు ఎంతవరకు పోరాడుతాయో చూడాలి.