YS Jagan : ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డిని కోలుకోలేని దెబ్బతీయాలని కూటమి భావిస్తోంది. వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తోంది. అయితే అందుకు పైఎత్తులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కూటమిని టార్గెట్ చేసుకొని కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. ఒకవైపు పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు.. ఇకనుంచి కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు. అదే సమయంలో ఒకప్పటి రాజశేఖర్ రెడ్డి సమకాలీకులను వైసీపీలోకి రప్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వారు ముహూర్తం చూసుకొని వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. వైసీపీకి విజయసాయిరెడ్డి లాంటి కీలక నేతలు గుడ్ బై చెప్పిన క్రమంలో.. పార్టీలో ఒక రకమైన నైరాశ్యం అలుముకుంది. అయితే కొత్త నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా సరికొత్త వ్యూహాలకు తెర తీశారు జగన్మోహన్ రెడ్డి.
* కాంగ్రెస్ లో హేమాహేమీలు
వైయస్ రాజశేఖర్ రెడ్డి( Rajasekhar Reddy ) ప్రోత్సహించిన చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అందులో చాలామంది నేతలు నిబద్దత ప్రదర్శించారు. వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా వారు ఇటువైపు చూడలేదు. అటువంటి నేతల్లో పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజానాథ్, అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు లాంటివారు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వీరు అధినేత జగన్ తో చర్చలు కూడా జరిపారు. వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రేపు వారు జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారు చేరితే రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ప్రధానంగా వైసీపీ నేతలతో రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యం పై దెబ్బ తీయాలని కూటమి భావించింది. కానీ అంతకంటే మించి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమకాలీకులను పార్టీలోకి రప్పించడం ద్వారా ధీటైన సమాధానం చెప్పనున్నారు జగన్.
* మారతానని చెప్పి మరి
విదేశీ పర్యటన నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)వరుసగా తాడేపల్లిలో రివ్యూలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తాను మారానని.. ఇప్పటివరకు ప్రజల కోసం జగన్ 1.0 వెర్షన్ చూశారని.. కార్యకర్తల కోసం, పార్టీ కోసం 2.0 వెర్షన్ చూస్తారని ప్రకటించారు. మరోవైపు జిల్లా పర్యటనలకు సిద్ధపడుతున్నారు. ఉగాది తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వారానికి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేయనున్నారు. నియోజకవర్గాల్లో చివరి నాయకుడి వరకు మాట్లాడనున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకొని నిర్ణయాలు తీసుకొనున్నారు. అయితే అదే సమయంలో పార్టీలో చేరికలను ప్రోత్సహించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి సమకాలీకులైన నేతలను పార్టీలోకి తెచ్చుకొనున్నారు.
* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో
వైయస్ రాజశేఖర్ రెడ్డి సాకే శైలజానాథ్ కు( sailaja Naat ) ప్రోత్సాహం అందించారు. 2004లో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో సింగనమల నియోజకవర్గం నుంచి తొలిసారిగా గెలిచారు శైలజానాథ్. 2009లో సైతం రాజశేఖర్ రెడ్డి రెండోసారి టిక్కెట్టు ఇవ్వడంతో అసెంబ్లీలో అడుగు పెట్టారు శైలజానాథ్. అయితే కాంగ్రెస్ పార్టీ భావజాలంతో అలానే ఉండిపోయారు శైలజానాథ్. అయితే కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఒంటెద్దు పోకడలు నచ్చక.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకోనున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేసిన జీవి హర్ష కుమార్ సైతం వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. ఇంకోవైపు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సైతం పునరాలోచనలో పడ్డారని.. ఆయన సైతం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తానికైతే వైయస్ రాజశేఖర్ రెడ్డి విధేయ బ్యాచ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వస్తుండడంతో షర్మిలకు షాక్ తగులుతోంది. అదే సమయంలో కూటమికి సైతం ఇది ఎదురుదెబ్బే.