YS Jagan Compromise with Sharmila : వైఎస్ షర్మిళ విషయంలో జగన్ వైఖరి మారుతోందా? గతానికి భిన్నంగా వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చారా? రాజకీయంగా విభేదించుకుంటే ప్రత్యర్థికే మేలు అని సన్నిహితులు సలహా ఇచ్చారా? వారిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో షర్మిళ వైసీపీకి ఎంతలా డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. ఆమె అధ్యక్షురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీ కూటమికే ఎక్కువగా మేలు చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం సోదరి షర్మిళను లైట్ తీసుకుంటూ వస్తున్నారు. ఆమె ఎప్పుడో తప్ప పెద్దగా విమర్శలు చేయడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం ఆమె జోలికి పోవడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ శత్రువులను తగ్గించుకోవాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ముందుగా కుటుంబంలో సయోధ్య ఏర్పాటుచేసుకుంటున్నట్టు బయట టాక్ నడుస్తోంది. అదే జరిగితే ముందుగా వైఎస్ షర్మిళతో వివాదాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
Also Read : టికెట్ రేట్స్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..ఫోటోలు వైరల్!
క్రమేపీ అలా దూరమై..
2019 ఎన్నికల వరకూ తన సోదరి షర్మిళతో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలే నడిచాయి. కానీ అటు తరువాత ఆమె నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. అది జగన్ కు ఇష్టం లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభకు వైసీపీ నుంచి ఎవరూ హాజరుకాలేదు. అప్పటి నుంచి వారి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. కానీ అంతకు ముందు నుంచే వ్యక్తిగత, ఆస్తి వివాదాలు కొనసాగాయని అప్పుడే బయటకు వచ్చింది. క్రమేపీ తెలంగాణ రాజకీయాల్లో షర్మిళ ఉన్నా జగన్ ఎన్నడూ పట్టించుకోలేదు. తల్లి విజయమ్మ సైతం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి షర్మిళ కు అండగా నిలిచారు. అయితే జగన్మోహన్ రెడ్డితో విభేదాలు పెరిగాయి. అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో రాణించలేకపోయారు. దీంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల వైపు వచ్చారు షర్మిళ. అప్పటి నుంచి సోదరుడు జగన్ తో వ్యక్తిగత, రాజకీయ వైరం మరింతగా నడిచింది.
వివేకానందరెడ్డి హత్యతో మరింతగా..
రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అది వసుదైక కుటుంబం. ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచింది ఆ కుటుంబం. జగన్ కష్టంలోనూ సుఖంలోనూ పాలుపంచుకుంటూ వచ్చింది. అయితే బాబాయ్ వివేకానందరెడ్డి హత్యతో కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. అయినా సరే 2019 ఎన్నికల్లో ఆ సానుభూతి అంతా జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అయ్యింది. రాజకీయ ప్రత్యర్థులే హత్య చేయించారన్న ప్రచారానికి ప్రజలు నమ్మారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే ఒకవైపు సోదరితో వ్యక్తిగత, ఆస్తిపరమైన వివాదాలు రావడం, వివేకానందరెడ్డిని సొంత కుటుంబసభ్యులే హత్య చేయించారని తెలియడం వంటి కారణాలతో.. కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు షర్మిళ. రాజకీయ, వ్యక్తిగత ఆరోపణలతో ప్రజల్లోకి బలంగా వెళ్లారు. అయితే అది వ్యతిరేకతగా మారి వైసీపీని డ్యామేజ్ చేసింది. అటు జగన్ సైతం షర్మిళ విషయంలో మరింత పట్టుదలకు పోయి వివాదాలు, గొడవలను పెంచుకొని మూల్యం చెల్లించుకున్నారు.
సాక్షిలో షర్మిళ వార్త..
అయితే జగన్మోహన్ రెడ్డి, షర్మిళ పప్పు ఉప్పులా మారిపోయారు. ఒకరినొకరు కలిసేందుకు కూడా ఇష్టపడడం లేదు. షర్మిళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉండడంతో ఆమెకు మీడియాలో ప్రాధాన్యత లభిస్తోంది. కానీ సాక్షి మీడియాలో మాత్రం ఆమెకు కనీసం చోటు ఉండదు. షర్మిళతో ఉన్నందున విజయమ్మకు సైతం పెద్దగా సాక్షి పట్టించుకోదు. అటువంటిది ఇటీవల షర్మిళ, విజయమ్మకు సంబంధించిన వార్త కడప జిల్లా టాబ్లాయిడ్ లో దర్శనమిచ్చింది. వైఎస్ రాజారెడ్డి శతజయంతి వేడుకల కోసం పులివెందుల వెళ్లారు షర్మిళ.ఆమె వెంట తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. ఇడుపాలపాయలో రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు ఆర్పించారు. ఈ వార్త సాక్షి కడప జిల్లా ఎడిషన్ లో కవరైంది. దీంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.