Jagan accuses Chandrababu: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) శాసనసభకు హాజరు కావడం లేదు. వారానికి ఒకసారి మీడియా ముందుకు వచ్చి వారాంతపు కామెంట్స్ చేస్తుంటారు. ఈరోజు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడనున్నారు. కచ్చితంగా ఈ వారం రాష్ట్ర అప్పులపై, ఆపై రాయలసీమ ఎత్తిపోతల పథకం పై మాట్లాడతారు. పనిలో పనిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రస్తావిస్తారు. ఇప్పటికీ ఇవే సజీవ అంశాలు. అయితే ప్రతి వారం వచ్చే ముందు సరైన ప్రిపరేషన్ తీసుకుంటారో లేదో కానీ.. జగన్ మాటల్లో తప్పులు దొర్లుతుంటాయి. సహజంగా మనం వ్యాఖ్యానించినప్పుడు కొన్ని రకాల మాటలు దొర్లడం సహజం. కానీ దానిని హైలెట్ చేసింది వైసీపీ సోషల్ మీడియా. ప్రత్యర్ధులు ఎవరైనా తప్పులు మాట్లాడితే చాలు విరుచుకుపడేది. ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడే వారు కాదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయింది. అందుకే ఎక్కువగా తప్పులు దొర్లుతున్నాయి.
ఈరోజు మీడియా ముందుకు..
ఈరోజు చంద్రబాబుపై( CM Chandrababu) విమర్శలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక అస్త్రం అందించారు. అదే రాయలసీమ ఎత్తిపోతల పథకం. చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయించాలని తెలంగాణ శాసనసభ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం.. ఏపీ ప్రయోజనాలకు అవకాశం ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబుతో నిలిపి వేయించాను అన్నది రేవంత్ వాదన. ఇప్పుడు ఇదే అంశాన్ని ఈరోజు అస్త్రంగా సంధించనున్నారు జగన్మోహన్ రెడ్డి. చూడండి చంద్రబాబు ఎంతకి దిగజారారో? ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా అని వ్యాఖ్యానించనున్నారు. కానీ అదే రాయలసీమ ఎత్తిపోతల పథకం తన హయాంలో నిలిచిపోయిన విషయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవాలి.
ఎటువంటి అనుమతులు తీసుకోకుండా..
2019లో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి రాయలసీమ ప్రజలు అండగా నిలుస్తూ వస్తున్నారు. అందుకు వారికోసం ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలి అని ఆలోచన చేశారు. అలా వచ్చినదే రాయలసీమ( Rayalaseema ) ఎత్తిపోతల పథకం. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడే వ్యూహం పన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు తీసుకోలేదు. దీంతో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెళ్లాయి.. అప్పట్లో కేంద్రం కలుగజేసుకొని ఎటువంటి అనుమతులు లేకపోవడంతో నిలిపివేసింది. ఇది వాస్తవం. అంటే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలోనే ఈ పథకం నిలిచిపోయిందన్నమాట. కానీ రేవంత్ రెడ్డి తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి రాజీలేదని చెప్పే ప్రయత్నంలో చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. ఇప్పుడు అదే చంద్రబాబును టార్గెట్ చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. తన హయాంలో నిలిచిపోయిన ప్రాజెక్టుకు చంద్రబాబును బాధ్యుడిగా చేయనున్నారు.
దానిపై నోరు తెరవని జగన్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) ప్రస్తావించేసరికి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు కనిపించాయి. కానీ ఇదే చంద్రబాబు రాయలసీమ కోసం బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. తెలంగాణ సమాజం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు తెరవలేదు. కనీసం ఈ అంశం గురించి స్పందించలేదు. పైగా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అంటూ గోబెల్స్ ప్రచారం చేశారు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తావిస్తూ రాజకీయం చేయాలనుకుంటున్నారు.