Kidnap for Money: జీవితంలో స్థిరపడాలని అన్నని కిడ్నాప్ చేయించింది.. తర్వాతే అసలు ట్విస్ట్ మొదలైంది

మాచర్ల కు చెందిన గుర్రం నిఖిత హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పని చేస్తోంది. అక్కడే పని చేస్తున్న కృష్ణా జిల్లా పెనమలూరు కు చెందిన వెంకటకృష్ణతో నిఖితకు పరిచయం ఏర్పడింది.

Written By: Neelambaram, Updated On : January 8, 2024 1:19 pm
Follow us on

Kidnap for Money: విలాసాలకు అలవాటు పడిన యువత పెడదోవ పడుతున్నారు. డబ్బు కోసం అయినవారిని సైతం అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా ఒకటివెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువకుడితో సంతోషంగా జీవించేందుకు ఓ యువతి స్వయాన సోదరుడినే కిడ్నాప్ చేయించింది. ఇందుకుగాను గరుడుగట్టిన కిడ్నాప్ గ్యాంగ్ తో చేతులు కలిపింది. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

మాచర్ల కు చెందిన గుర్రం నిఖిత హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పని చేస్తోంది. అక్కడే పని చేస్తున్న కృష్ణా జిల్లా పెనమలూరు కు చెందిన వెంకటకృష్ణతో నిఖితకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నిఖిత ఈనెల 4న పెదనాన్న కుమారుడైన సురేంద్ర కు ఫోన్ చేసింది. తనను ఒకరు వేధిస్తున్నారంటూ.. ఖాజాగూడ చెరువు దగ్గరకు రావాలని కోరింది. దీంతో ఆందోళనతో సురేంద్ర అక్కడికి చేరుకున్నాడు. నిఖిత తో మాట్లాడుతుండగా ఓ అయిదుగురు వ్యక్తులు కారులో వచ్చి సురేంద్ర ను బలవంతంగా తీసుకెళ్లారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిఖిత కిడ్నాప్ ఉదంతాన్ని తెలియజేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సురేంద్ర ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నారు. ఏడాదికి కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు. ఆయన భార్య సైతం ఐటీ ఉద్యోగి. దీంతో కిడ్నాపర్లు ఫోన్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. అయితే కిడ్నాపర్లు కారులో సురేంద్రను హైదరాబాదు నుంచి కర్నూలు తరలించే ప్రయత్నం చేశారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో.. అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఈ కిడ్నాప్ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లలో రోహిత్, సురేంద్ర దొరికిపోయారు. మిగిలిన ముగ్గురు పరారయ్యారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

ఈ కిడ్నాప్ ఉదంతానికి సూత్రధారి నిఖిత అని తేలిపోయింది. నిఖిత అదే ఆఫీసులో పనిచేస్తున్న వెంకటకృష్ణ ప్రేమించుకుంటున్నారు. వెంకట కృష్ణ పై గతంలో కేసులు సైతం ఉన్నాయి. డ్రగ్స్, వ్యభిచారం కేసుల్లో జైలుకు వెళ్లాడు. ఆ సమయంలోనే కరుడుగట్టిన నేరగాడు, ప్రధాన కిడ్నాపర్ గుంజుపోగు సురేష్ అలియాస్ సూర్యతో పరిచయం కలిగింది. తమ గ్యాంగ్ కిడ్నాప్ లు చేస్తుందని.. ఎప్పుడైనా అవసరం ఉంటే చెప్పాలని సురేష్ వెంకటకృష్ణకి చెప్పాడు. ఈ నేపథ్యంలో నిఖితకు పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలని వెంకటకృష్ణ భావించాడు. ఈ నేపథ్యంలో డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేస్తే లాభం ఉంటుందని వెంకటకృష్ణతో పాటు నిఖిత ఆశించారు. అందుకు సురేంద్ర ను ఎంచుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నిఖిత ఆపదలో ఉన్నట్లు నటించి సురేంద్ర ను బయటకు తెప్పించింది. కిడ్నాపర్లకు అప్పగించింది. ఎప్పటికప్పుడు కిడ్నాపర్లకు టచ్ లో ఉంటూ నాటకం ఆడించింది. ఎట్టకేలకు పోలీసు విచారణలో ఆమె పాత్ర తేలడంతో.. ఆమెతో పాటు ప్రియుడు వెంకటకృష్ణ, మిగతా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.