AP Politics: వార్తా పత్రికలకు కాలం చెల్లింది. ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా రాజ్యమేలుతోంది. అందుకే వార్తా పత్రికలకు అనుబంధంగా డిజిటల్ ఎడిషన్ లను ప్రారంభిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీడియా పరిధి పెరిగింది. కానీ మీడియాలో గుత్తాధిపత్యం ఎల్లో మీడియాదే. తమకు నచ్చిన ప్రభుత్వం ఉండాలి. తాము మెచ్చిన వారు అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఎంత దాకైనా వెళ్లేందుకు ఎల్లో మీడియా సిద్ధపడుతుంది. గత నాలుగు సంవత్సరాలుగా జగన్ సర్కార్ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.
ఆ మధ్యన జగన్ వ్యక్తిగత పనిమీద లండన్ వెళ్లారు. పూర్తిగా అది ప్రైవేట్ టూర్. సాధారణంగా లండన్ వెళ్లాలంటే విమానంలో వెళ్లాలి. లేకుంటే అతి కష్టం మీద సముద్ర యానం చేయాలి. ఈ విషయంలో కూడా ఎల్లో మీడియా రకరకాల కథనాలను ప్రచురించింది. ” చాప్టర్ ఫ్లైట్లో పేదల పక్షపాతి ” అంటూ పతాక శీర్షికన కథనం వేసింది. కుమార్తెలను చూసేందుకు జగన్ భార్యతో కలిసి లండన్ వెళ్లారు. చంద్రబాబు నాయుడు అయినా వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు విమానంలోనే వెళ్తారు. అవసరం అనుకుంటే చార్టెర్డ్ ఫ్లైట్లో ప్రయాణం చేస్తారు. అయితే తనకు తాను పేదల పక్షపాతినని జగన్ చెప్పారే తప్ప.. తాను పేదవాడినని ఏనాడూ చెప్పలేదు. కానీ ఎల్లో మీడియా అదే పనిగా జగన్ ను పలుచన చేయాలని చూసే క్రమంలో విశ్వసనీయత పోగొట్టుకుంటుంది.
రాష్ట్రంలో అభివృద్ధి లేదని.. అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని ఇదే ఎల్లో మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంటే.. అవి బడా కాంట్రాక్టులకేనని చెప్పుకొస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో పట్టిసీమ, అమరావతి వంటి కీలక నిర్మాణాలకు బడా కాంట్రాక్టర్లకే చంద్రబాబు బిల్లులు చెల్లించిన మాట వాస్తవం కాదా? ఇప్పటికీ వేలాది కోట్లు పెండింగ్లో ఉండిపోయాయంటూ నాటి కాంట్రాక్టర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కదా? వారంతా బడా కాంట్రాక్టర్లే కదా? అటువంటప్పుడు ఎల్లో మీడియా ఎలా విమర్శించగలదు. అంటే వారి తీరే వేరు. అర్జెంటుగా జగన్ గద్దె దిగిపోవాలి. చంద్రబాబు అధికారం చేపట్టాలి. ఆ ఆకాంక్ష తప్ప.. మరొకటి వారికి కనిపించదు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని ప్రశ్నించడం మీడియా ప్రధాన విధి. ప్రజా సమస్యలను బయట పెట్టడం కూడా మీడియా తక్షణ కర్తవ్యం. అయితే ప్రజలను ప్రభావితం చేసేలా కథనాలు రాసి తప్పుదారి పట్టించడం మాత్రం ముమ్మాటికి తప్పిదమే. ఇప్పటికే పత్రికలకు ప్రజలు దూరమయ్యారు. పేద, ధనిక వర్గాల వారు కనీస స్థాయిలో కూడా విశ్వసించడం లేదు. ఒక్క మధ్యతరగతి ప్రజలే పాఠకులుగా ఉన్నారు. ఈ విషయాన్ని మరుస్తున్న ఎల్లో మీడియా మొత్తం ఏపీ సమాజాన్ని ప్రభావితం చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.