https://oktelugu.com/

YCP Social Media : మరణాలు, పరామర్శలను వదలని వైసిపి సోషల్ మీడియా

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు కొనసాగుతోంది. అయినా సరే సోషల్ మీడియాలో వారి హవా తగ్గడం లేదు. తాజాగా సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. కానీ చాలామంది నందమూరి కుటుంబ సభ్యులు స్పందించలేదన్నది కొత్త ప్రచారం.

Written By: Dharma, Updated On : November 19, 2024 12:00 pm
YCP Social Media

YCP Social Media

Follow us on

YCP Social Media :  సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామ్మూర్తి నాయుడు పాడె మోసి రుణం తీర్చుకున్నారు సోదరుడు చంద్రబాబు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు రామ్మూర్తి నాయుడు. బయటకు రాలేనంత అనారోగ్యంతో గడిపేవారు. అయితే కుటుంబ వ్యవహారాలను బయటకు తెచ్చి వైసిపి సోషల్ మీడియాలో ప్రచారం చేసేది. గత ఎన్నికల్లో సైతం రామ్మూర్తి నాయుడు వ్యవహారాన్ని బయటకు తెచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ మామతో అనుచిత వ్యాఖ్యలు చేయించింది. రామ్మూర్తి నాయుడు ను గొలుసులతో బంధించి ఇబ్బంది పెట్టారని కూడా చెప్పుకొచ్చింది. అయితే దీనిని ఖండించారు రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్. పెదనాన్న చంద్రబాబు తమను బాగానే చూసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయినా సరే ఏదో ఒక వివాదం తేవాలని భావిస్తోంది వైసిపి. తాజాగా రామ్మూర్తి నాయుడు మరణాన్ని కూడా వదలడం లేదు.ఆయన మృతిపై నందమూరి కుటుంబం స్పందించలేదన్నది దాని సారాంశం. దీంతో మరోసారి వైసీపీ సోషల్ మీడియా వ్యవహార శైలి చర్చకు దారి తీసింది.

* ఏది జరిగినా హైలెట్ గా
నందమూరి, నారా కుటుంబం పై జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. వారి ఇంట్లో శుభకార్యం జరిగినా, విషాదం అలుముకున్నా.. దానిని హైలెట్ చేస్తోంది సోషల్ మీడియా. చిన్నపాటి లోపాన్ని భూతద్దంలో పెట్టి బాహ్య ప్రపంచంలోకి తెస్తోంది. ఆ కుటుంబ మనోభావాలను దెబ్బతీస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు కావాల్సిన మనిషి. బావమరిది హరికృష్ణ కుమారుడు. ఆపై తారక్ భార్య స్వయానా తన మేనకోడలి కుమార్తె. ఈ రకంగా జూనియర్ ఎన్టీఆర్ నారా కుటుంబానికి చాలా దగ్గర మనిషి. ఆయన ఎందుకు స్పందించలేదన్నది సోషల్ మీడియా అనుమానం. అయితే కేవలం ట్విట్టర్ ద్వారా స్పందిస్తేనే.. స్పందించినట్టా. స్వయంగా పలకరించి ఉండవచ్చు కదా. కానీ వారికి కావాల్సింది ప్రచారం. ఆపై దుష్ప్రచారం.

* ప్రతిదీ వార్తే
నందమూరి కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు వైసీపీ సోషల్ మీడియాకు అవసరం కూడా. ఆ కుటుంబంలో జరిగే ప్రతి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఎన్టీఆర్ జయంతి వేడుకలకు తారక్ రాకపోయినా ప్రచారమే. మహానాడుకు రాకపోయినా ప్రచారమే. వివాహాలు, వేడుకలకు రాకపోయినా ప్రచారమే. మరో పని అంటూ లేకుండా పనిగట్టుకుని నారా కుటుంబం విషయంలో చిలువలు పలువులు చేసి ప్రచారం చేయడం వైసిపి సోషల్ మీడియాకు అలవాటైన విద్యగా మారిపోయింది.