Prakasam: గతంలో గ్రామాల్లో సర్పంచులు అంటే గౌరవం ఉండేది. సమస్యలు పరిష్కరిస్తారని నమ్మకం ఉండేది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందు సర్పంచ్ని కలిసేవారు. పరిష్కరించమని వేడుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ పని చేయాలన్నా వాలంటీర్లే. ప్రభుత్వ పథకాలు, పౌర సేవలు అన్ని వారి చేతిలోనే పెట్టింది జగన్ సర్కార్. ఏ నిధులు రాక.. పంచాయితీలు ఎలా నడపాలో తెలియక ఆపసోఫాలు పడుతున్నారు. లక్షలు వెచ్చించి గెలిచామని.. ఎందుకు ఈ పదవి అంటూ ఎక్కువమంది సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా సర్పంచులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థతో తమ హక్కులకు భంగం వాటిల్లిందని.. కనీసం వాలంటీర్లకు ఉన్న గౌరవం కూడా మాకు లేకుండా పోతుందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు, విధుల పరంగా ఎటువంటి ప్రాధాన్యత లేదని.. తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆవేదనతో ఉన్నారు. అధికార పార్టీ సర్పంచుల సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్యన ఓ సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి హయాంలో సర్పంచ్ అయినందుకు తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ అయితే అభివృద్ధి పనికి సంబంధించి శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆయన సైతం అధికార వైసీపీకి చెందిన సర్పంచ్ కావడం గమనార్హం.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం చెట్లమిట్ట, రేగుమాను పల్లి గ్రామాలకు ఒకే సచివాలయాన్ని నిర్మించారు. కానీ వేగుమానుపల్లి సర్పంచ్ రామాంజనేయరెడ్డి పేరు ఆ శిలాఫలకంలో లేదు. వార్డు మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు అంటూ ఎవరెవరో పేర్లను అందులో పొందుపరిచారు. కానీ సర్పంచ్ రామాంజనేయరెడ్డి పేరును మాత్రం విస్మరించారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు లేక.. ప్రజలు అడుగుతున్న పనులు చేయలేక రామాంజనేయరెడ్డి ఆవేదనతో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ భవనం శిలాఫలకంలో తన పేరు లేకపోయేసరికి ఆగ్రహంతో ఊగిపోయారు. సుత్తితో మరి ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. విపరీతంగా వైరల్ అవుతున్నాయి.