YCP : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఓటమి నుంచి చాలా రకాలుగా గుణ పాఠాలు నేర్చుకుంది. ముఖ్యంగా అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి బాధ నుంచి బయటకు వచ్చారు. పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా కూడా వేగం పెంచుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో ప్రజల మధ్యకు వచ్చి పోరాటం చేయాలని భావిస్తున్నారు. త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పరిశీలకులను నియమించారు. జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అనుబంధ విభాగాలను భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇవి కొలిక్కి వచ్చిన తరువాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.
Also Read : ఉత్తరాంధ్రలో వైసీపీకి డేంజర్ బెల్స్
* వచ్చే ఏడాది జూలై 8న..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని ( plainery )వచ్చే ఏడాది జూలైలో నిర్వహించాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. జూలై 8న వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకరకంగా పార్టీ ప్లీనరీని ఎన్నికల శంఖారావంగా జగన్ భావిస్తున్నారు. అందుకే ఘనంగా నిర్వహించి పార్టీ శ్రేణులతో పాటు ప్రజలకు ఎన్నికల పిలుపు ఇవ్వాలని చూస్తున్నారు. తెలుగుదేశం మహానాడు తరహాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని నిర్వహించాలని చూస్తున్నారు. తద్వారా 2027 పాదయాత్ర ప్రకటన బహిరంగంగా అక్కడే ఇవ్వాలని భావిస్తున్నారు. 2017లో పాదయాత్ర ప్రకటన ఇలానే ప్లీనరీలో చేశారు.
* గోదావరి జిల్లాలో..
అయితే ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీని ఉభయగోదావరి( Godavari district) జిల్లాలో నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాలో భారీ మూల్యం చెల్లించుకుంది. కనీసం ఖాతా తెరవలేదు. టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. జనసేన హవా ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ఆ రెండు పార్టీలతో పోలిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. పైగా వైయస్సార్ కాంగ్రెస్ కీలక నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ శ్రేణులు సైతం తీవ్ర నిరాశతో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్లీనరీ నిర్వహించడం ద్వారా.. సరికొత్త సంకేతాలు పంపించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు
Also Read : సీనియర్ల రాజకీయ సన్యాసం.. ఉత్తరాంధ్రలో వైసీపీకి కష్టకాలం!
* విభేదాలను క్యాష్ చేసుకోవాలని..
ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి పార్టీల మధ్య సరైన సమన్వయం లేదు. ఒక్క పిఠాపురంలో( Pithapuram ) తప్పించి.. మిగతా నియోజకవర్గాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. దానిని క్యాష్ చేసుకోవడం ద్వారా.. అసంతృప్త నేతలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 2029 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలే కీలకమని భావిస్తున్నారు. అందుకే అక్కడ ప్లీనరీ నిర్వహించాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు.