YCP Party : వైసిపి ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ముందుంటారు. అయితే వీరు కేవలం చంద్రబాబు కుటుంబం పైనే విరుచుకుపడేవారు. నాని మంత్రిగా వ్యవహరించిన సమయంలో సైతం తన శాఖ ప్రగతి కంటే చంద్రబాబు కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇచ్చేవారు.వల్లభనేని వంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. టిడిపి నుంచి గెలిచిన ఆయన వైసీపీలోకి ఫిరాయించారు. చంద్రబాబు సతీమణి పై అభ్యంతరకర కామెంట్స్ చేసి తెలుగుదేశం పార్టీకి శత్రువు అయ్యారు. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కొడాలి నాని. 2004, 2009లో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత వైసిపిలో చేరి 2014లో ఆ పార్టీ తరఫున గెలిచారు. 2019లో గెలిచి మంత్రి అయ్యారు. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ పై ఏనాడు మర్యాదగా మాట్లాడిన సందర్భం లేదు. కొడాలి నోటి నుంచి వచ్చిన మాటలు వైసీపీ శ్రేణులకు వినసొంపుగా ఉండేవి. కానీ వైసీపీ పట్ల తటస్థుల అభిప్రాయం మారింది ఇటువంటి వారి నుంచే. వైసిపి ఓటమికి ఇటువంటి నేతలే కారణమని ఆ పార్టీ నాయకులు బాహాటంగానే చెప్పుకొచ్చారు కూడా.
* చంద్రబాబు కుటుంబం టార్గెట్
2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వల్లభనేని వంశీ. జూనియర్ ఎన్టీఆర్ ప్రోద్బలంతో టికెట్ దక్కించుకున్న వంశీ.. ఆ ఎన్నికల్లో గెలిచారు. ఐదేళ్లపాటు టిడిపి ప్రభుత్వంలో మంచి గుర్తింపు సాధించుకున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచారు. అయితే గెలిచిన కొద్ది నెలలకే వైసీపీలోకి ఫిరాయించారు. వైసీపీలోకి వెళ్తూ వెళ్తూ చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలకు కారణమయ్యారు. ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అప్పటినుంచి సొంత నియోజకవర్గ ముఖం కూడా చూడడం లేదు. అటు కొడాలి నాని పరిస్థితి కూడా అలానే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై నోరు పారేసుకున్నారు. ఇప్పుడు ఆచూకీ లేకుండా ఎక్కడో దాక్కున్నారన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అధికారం శాశ్వతం కాదని తెలిసి కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు కేసుల భయంతో హైదరాబాదులో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది.
* నాయకత్వం లేక..
ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో వైసిపి పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ఆ నేతలను పిలిచి ఏనాడు జగన్ కంట్రోల్ చేసిన దాఖలాలు లేవు. అందుకు ఇప్పుడు పార్టీ మూల్యం చెల్లించుకుంటోంది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న గుడివాడ ఇప్పుడు మంచు కోటలా మారిపోతోంది. అక్కడ క్రమేపి టిడిపి బలపడుతోంది. ఇక గన్నవరంలో అయితే పరిస్థితి చెప్పనవసరం లేదు. మొత్తం టిడిపి సరెండర్లోకి వెళ్లిపోయింది. అయితే ఆ ఇద్దరు నేతలు కాదు.. ఇప్పుడు వైసీపీ ఉనికి అక్కడ ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరు నేతలకు ప్రత్యామ్నాయంగా ఎవరినైనా ప్రోత్సహిస్తారా? లేకుంటే వారు వచ్చేవరకు వెయిట్ చేస్తారా? అన్నది చూడాలి.