Amaravati : అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని చూస్తోంది. ఇందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఒకవైపు నిధులు సమకూర్చుతూనే.. రైల్వే తో పాటు రవాణా ప్రాజెక్టులను అమరావతికి కేటాయిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త కళ వచ్చింది. జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. 2019 సమయంలో ఉన్న స్థితికి చేరుకుంది అమరావతి. అయితే ఒక విధంగా కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో అమరావతికి కొత్త ఊపిరి వచ్చింది. టిడిపి కూటమి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 15000 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. అయితే అది అప్పు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. కాదు కాదు మా షూరిటీతో ఇచ్చిన రుణం అంటూ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ రుణం తిరిగి చెల్లించే బాధ్యత తమదేనంటూ సంకేతాలు ఇచ్చింది. దీంతో ఈ నిధుల విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. మరోవైపు జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తాజాగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో పాటు ప్రపంచ బ్యాంకు శుభవార్త చెప్పాయి.
* అమరావతిని సందర్శించిన ప్రతినిధులు
కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు తర్వాత ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియన్ బ్యాంకు ప్రతినిధులు అమరావతిని పలుమార్లు సందర్శించారు. ఇక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ ఉన్నతాధికారులకు నివేదించారు. అయితే ఈ ప్రతిపాదనలకు ఆ రెండు బ్యాంకులు ఆమోదం ముద్ర తెలిపాయి. రుణం విడుదలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తాజాగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అమరావతి రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదన ఆమోదించడంతో పాటు 788 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించేది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు కూడా అదే బాటలో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానికి ఎనిమిది వందల మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఇచ్చిన ప్రతిపాదనకు ఈరోజు ఆమోద ముద్ర వేసింది. ప్రపంచ బ్యాంకు బోర్డు భేటీలో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర పడినట్లు తెలుస్తోంది.
* మంచి పరిణామం
ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్న ప్రతిపాదనను వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. అదే సమయంలో కేంద్రం సమకూర్చిన నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. నవ నగరాలతో అమరావతిని నిర్మించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇప్పుడు అదే సమయంలో నిధుల సమీకరణకు కూడా అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రపంచ బ్యాంకు తోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు 15 వేల కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చేందుకు అన్ని చిక్కుముళ్ళు వీడాయి. ఇది ఒక విధంగా అమరావతికి శుభ పరిణామమే.