AP Elections 2024: వైసీపీ మేనిఫెస్టో vs టీడీపీ మేనిఫెస్టో : ఏదీ బాగుంది? వ్యత్యాసాలివీ

జగన్ సామాజిక పింఛన్ మొత్తాన్ని 3,500 రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారు. అది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతల్లో పెంచుతానని చెప్పుకొచ్చారు.

Written By: Dharma, Updated On : April 30, 2024 6:12 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024:’ఉచితాలతో ఈ రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా తయారు చేస్తున్నారు. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు పాటు వెనక్కి నెట్టారు’ గత ఐదు సంవత్సరాలుగా టిడిపి, జనసేన, బిజెపి కంఠశోష ఇది. కానీ ఇప్పుడు జగన్కు మించి పథకాలను ప్రకటించారు. మేనిఫెస్టోలో ఆకర్షవంతమైన పథకాలకు పెద్దపీట వేశారు. వాటినే తెలుగుజాతి పూర్వవైభవానికంటూ చెప్పుకొస్తున్నారు. జగన్ అమలు చేసిన సంక్షేమాన్ని ఆక్షేపించిన వారే.. ఇప్పుడు అమలు చేస్తామని చెబుతున్నారు. మొన్నటికి మొన్న జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. గతంలో తాను అమలు చేసిన పథకాల లబ్ది మొత్తాన్ని కొంచెం పెంచారు.అయితే తాజాగా కూటమి మేనిఫెస్టోలో సైతం జగన్ పథకాలు కనిపిస్తుండడం విశేషం. నాటి పథకాలతోనే.. నేడు ఎన్డీఏ ప్రకటించిన పథకాలకు సారుప్యత కనిపిస్తోంది.

జగన్ సామాజిక పింఛన్ మొత్తాన్ని 3,500 రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారు. అది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతల్లో పెంచుతానని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ మాత్రంఅధికారంలోకి వచ్చిన మరుక్షణం 4000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అమలు చేస్తామని చెప్పుకొచ్చింది. దానిని ఈ ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని కూడా చెప్పింది. వికలాంగుల పింఛన్ మొత్తాన్ని 6 వేలకు, పూర్తిగా వికలాంగులైతే పదివేలకు పింఛన్ మొత్తాన్ని పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు.

ఇక చదువుకు ప్రోత్సాహం కింద జగన్ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇస్తున్న 15 వేల రూపాయలను.. జగన్ 17 వేలకు పెంచారు. అయితే అదే పథకాన్ని ఎన్డీఏ సైతం అమలు చేస్తామని చెప్పింది. కుటుంబంలో గరిష్టంగా ముగ్గురు పిల్లలు ఉంటే.. 15వేల రూపాయల చొప్పున 45000 అందిస్తామని ప్రకటించింది. ఇక రైతు భరోసా కింద ఇప్పుడు అందుతున్న 13500 నుంచి జగన్ 16 వేలకు పెంచారు. ఎన్డీఏ మాత్రం ఒక్కో రైతుకు 20వేల రూపాయల సాగు సాయం అందిస్తామని ప్రకటించింది.

వైసీపీ మేనిఫెస్టోలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు చేయూత పథకం ద్వారా ఇచ్చే మొత్తం ఐదేళ్లలో 75000 కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. ఉమ్మడి మేనిఫెస్టోలో మాత్రం 18 నుంచి 59 ఏళ్ల వరకు మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించింది.

వైసీపీ మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశానికి ప్రాధాన్యం ఇవ్వగా.. కూటమి మాత్రం అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. వైసీపీ మేనిఫెస్టోలో లానేస్తం, కాపు నేస్తం, వాహన మిత్ర పథకాలు కొనసాగిస్తామని.. ఈ బీసీ నేస్తాన్ని 45 వేల నుంచి లక్ష 5000 కు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ కూటమి మేనిఫెస్టోలో బీసీలకు సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామని మాత్రమే ప్రకటించింది. వైసీపీ మేనిఫెస్టోలో లేని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డీఎస్సీ, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలకు ఎన్డీఏ కూటమి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అయితే చాలా వరకు పథకాలకు సారూప్యత ఉండడం విశేషం.