Shock to YCP : పట్టణాలు, నగరాలు టిడిపి ఖాతాలోకి.. ఏం చేయలేని స్థితిలో వైసిపి!

 అధికారాన్ని వెతుక్కుంటూ నేతలు వెళ్లడం సర్వసాధారణం. ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది అదే. మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని వైసిపి సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు టిడిపిలోకి వెళుతుండడాన్ని నిలువరించలేకపోతోంది.

Written By: Dharma, Updated On : August 16, 2024 1:53 pm

YCP Leaders Joining in TDP

Follow us on

Shock to YCP : వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పట్టణాల్లో వైసీపీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీకి చెందిన ప్రతినిధులు టిడిపిలో చేరుతున్నారు. నగరపాలక సంస్థలతో పాటు మున్సిపాలిటీలు టిడిపి వశం అవుతున్నాయి. వైసిపి హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో..దాదాపు అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను వైసిపి కైవసం చేసుకుంది. అప్పట్లో పూర్తిగా అధికార బలాన్ని వినియోగించుకుంది. కొన్నిచోట్ల ప్రత్యర్థులు నామినేషన్లు కూడా వేయని పరిస్థితిని కల్పించింది. మరి కొన్ని చోట్ల నామమాత్రంగా పోటీ పెట్టించి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే నాడు చంద్రబాబు ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించారు.బలవంతంగా మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి గెలవడాన్ని గుర్తించి అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క తాడిపత్రి నియోజకవర్గం తప్పించి..మిగతా పట్టణాలు, నగరాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి.కానీ ఇప్పుడు సీన్ మారింది. రాష్ట్రంలో అధికారం మారడంతో అవే పట్టణాలు,నగరాలు టిడిపి కూటమి చేతిలో చేరుతున్నాయి.కార్పొరేషన్ మేయర్లు, కార్పొరేటర్లు.. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు.. ఇలా అందరూ టిడిపిలో చేరుతుండడంతో ఆ పార్టీకి బలం పెరుగుతోంది.గతంలో ఏకగ్రీవంగా వైసీపీ సొంతం చేసుకున్న మున్సిపాలిటీలు ఇప్పుడు టిడిపి ఖాతాలో పడుతున్నాయి. ఇప్పటికే చిత్తూరు, ఒంగోలు, విశాఖపట్నం, నెల్లూరు కార్పొరేషన్లలో చాలామంది కార్పొరేటర్లు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఇప్పటికే టిడిపిలో చేరారు. చాలాచోట్ల మేయర్లు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. స్థానిక కారణాల దృష్ట్యా టిడిపి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
 *టిడిపి ఖాతాలోకి మాచర్ల 
 తాజాగా పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ టిడిపి కైవసం చేసుకుంది. ఇప్పటికే 14 మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరారు.మున్సిపల్ చైర్మన్ మాచర్ల చిన్న ఏసోబు, వైస్ చైర్మన్ నరసింహారావు సైతం టిడిపిలో చేరనున్నారు. మొత్తం 31 వార్డులకు గాను.. అప్పట్లో అన్ని స్థానాలు వైసీపీ నేతలకు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు అధికారం మారడంతో వారు టిడిపిని వెతుక్కుంటూ ఆ పార్టీలో చేరుతున్నారు. మొత్తం గుంప గుత్తిగా పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే 16 మంది చేరగా.. మరో 14 మంది జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.అదే జరిగితే మాచర్ల టిడిపి నీడకు చేరినట్టే.
* హిందూపురంలో అదే సీన్ 
 హిందూపురంలో సైతం ఇదే పరిస్థితి ఉంది.హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని వైసిపి కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. మొత్తం 38 వార్డులకు గాను 30చోట్ల వైసిపి గెలుపొందింది.తాజాగా చైర్ పర్సన్ ఇంద్రజాతో పాటు పదిమంది కౌన్సిలర్లు బాలకృష్ణ సమక్షంలో టిడిపిలో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. హిందూపురంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.ఆ పార్టీ విజయం సాధించింది. ఇక తమకు తిరుగులేదని భావించింది. కానీ ఎన్నికల్లో ఓటమితో సీన్ మారింది.
 *రెండు నెలల్లో అంతా ఖాళీ 
 మరో రెండు నెలల్లో దాదాపు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైసిపి కనిపించే ఛాన్స్ లేదు.స్వచ్ఛందంగా చేరికలకు టిడిపి కూటమి ప్రోత్సహించే అవకాశం ఉంది.ఒకవేళ ఎవరైనా మొండికేస్తే అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి శాసనసభలో చట్ట సవరణ చేపట్టాలని కూడా డిసైడ్ అయినట్లు సమాచారం. మొత్తానికైతే నాడు అధికార దర్పాన్ని చూపి పట్టణాలు, నగరాలను సొంతం చేసుకున్న వైసిపి..ఇప్పుడు సొంత పార్టీ ప్రతినిధులు టిడిపిలోకి వెళ్తున్న నిలువరించే పరిస్థితిలో లేకపోవడం విశేషం.