YCP Leaders: టీడీపీ లేదా బీజేపీ.. వైసిపి నేతల ఆపసోపాలు

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. వైసిపి 151 స్థానాలతో విజయం సాధించింది. అప్పుడు కూడా మెజారిటీ టిడిపి నాయకులు బిజెపి వైపు చూశారు.సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, టీజీ వెంకటేష్.. ఇలా కేసుల భయం ఉన్న నేతలంతా బిజెపిలోకి క్యూ కట్టారు. ఇటు గ్రామస్థాయి క్యాడర్ సైతం టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్ళింది.

Written By: Dharma, Updated On : July 9, 2024 12:52 pm

YCP Leaders

Follow us on

YCP Leaders: అమరావతి : ఏపీలో వైసీపీ నేతలు విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తమకు ఈ ఐదేళ్ల కాలం ఇబ్బందులు తప్పవని భావిస్తున్న చాలామంది నేతలు పక్క చూపులు చూస్తున్నారు. సేఫ్ జోన్ లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ముఖ్యంగా టిడిపిలో చేరితే తమకు ఇబ్బందులు ఉండవని ఆలోచన చేస్తున్నారు. కానీ టిడిపి నాయకత్వం మాత్రం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.జనసేనలో సైతం సేమ్ సీన్. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కూటమి పార్టీలతో సమన్వయం చేసుకోవాలని.. పార్టీ లైన్ దాటవద్దని సూచించారు.ఇప్పుడు అందరికీ కనిపిస్తున్న పార్టీ బిజెపి.జాతీయ పార్టీ కావడంతో ఆ పార్టీలో చేరేందుకు మెజారిటీ వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండడం విశేషం. వైసిపి కీలక నేతల నుంచి గ్రామస్థాయి క్యాడర్ వరకు అంతా బిజెపిలో చేరేందుకు సిద్ధపడుతుండడం విశేషం.

* అప్పట్లో క్యూ కట్టిన టిడిపి నేతలు..
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. వైసిపి 151 స్థానాలతో విజయం సాధించింది. అప్పుడు కూడా మెజారిటీ టిడిపి నాయకులు బిజెపి వైపు చూశారు.సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, టీజీ వెంకటేష్.. ఇలా కేసుల భయం ఉన్న నేతలంతా బిజెపిలోకి క్యూ కట్టారు. ఇటు గ్రామస్థాయి క్యాడర్ సైతం టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్ళింది. ఎన్నికల ముంగిట చాలామంది నేతలు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే సమయంలో టిడిపి, బిజెపి మధ్య పొత్తు కుదరడంతో.. ఇలా వెళ్లిన నేతలు పెద్దగా ఇబ్బంది పడలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అవసరాల మేరకు బిజెపిలో చేరిన నాయకులు, క్యాడర్ తో పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఆశించిన స్థాయిలో బిజెపి బలపడలేకపోయింది. అందుకే ఇప్పుడు వైసీపీ నుంచి బిజెపిలోకి చేరికలకు పెద్దగా నాయకత్వం ప్రోత్సహించడం లేదు.
* కేసుల భయంతో పరుగులు
చంద్రబాబు సర్కార్ వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తోంది. గత ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతోంది. గత ప్రభుత్వ అక్రమాలు, అవినీతిపై దృష్టి పెట్టింది. దీంతో నిన్న మొన్నటి వరకు వైసీపీలో పదవులు వెలగబెట్టిన కీలక నేతలంతా భయపడిపోతున్నారు. కేసులతో పాటు జైలు జీవితం తప్పదని భావిస్తున్నారు. అందుకే టిడిపిలోకి వెళ్తే కేసుల నుంచి బయటపడవచ్చు అని ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖ మాజీ ఎంపీ ఎంవిఎస్ సత్యనారాయణ, ఆయన అనుచరుడు జీవి తదితరులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే వీరిద్దరిపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వారిని తీసుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. అందుకే ఇప్పుడు వీరు బిజెపిలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే బిజెపి హై కమాండ్ సైతం.. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం కావడం, కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కీలకం కావడం తదితర కారణాలతో.. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. చేరికల విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది.