MP Avinash Reddy : ఇంతటితో అపేద్దాం.. అవినాష్ ను ఒప్పిస్తున్న పెద్దలు

సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే... ఆయనే సీబీఐ విచారణకు హాజరయ్యేలా అవినాశ్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేస్తే చేసుకోని! తర్వాత చూసుకుందాం. జగన్‌ కూడా 16 నెలలు జైలులో ఉన్నారు కదా! ఇప్పుడు జరుగుతున్న తంతుతో నీకూ చెడ్డపేరు. మాకూ ఇబ్బంది అని అవినాశ్‌కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నాటికి దీనికి ఒక ఎండ్ కార్డు పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Written By: Dharma, Updated On : May 23, 2023 12:26 pm
Follow us on

MP Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డి ఇష్యూతో నష్టం తప్పదని వైసీపీ సర్కారు భావిస్తోందా? విచారణ పేరుతో జరుగుతున్న హైడ్రామాతో చెడ్డపేరు వస్తోందని కలత చెందుతుందా? దాగుడు మూతలతో అసలుకే ఎసరు అని భయపడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి ఎండ్ కార్డు వేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫుల్ స్టాప్ పెట్టకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జగన్ శిబిరం భావిస్తోంది. ఇదొక హై ప్రొఫైల్ కేసు బాధితులు, నిందితులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. అటువంటి కేసులో జరుగుతున్న పరిణామాలు అనుమానితంగా ఉన్నాయి. కేసు పక్కదారి పట్టించేలా ఉన్నాయి. ఇది కానీ ప్రజల్లోకి బలంగా వెళితే నష్టం తప్పదని ప్రభుత్వ వర్గాలతో పాటు వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

అయితే ఈ ఇష్యూలో సీబీఐ చర్యలే చర్చనీయాంశంగా మారతున్నాయి. ఇటీవల సీబీఐ విచారణలు, అరెస్టులకు భిన్నంగా ఇక్కడ పరిణామాలు ఉన్నాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా వంటి వారి అరెస్ట్ విషయంలో సున్నితంగా వ్యవహరించిన సీబీఐ.. ఆ చాకచక్యత అవినాష్ విషయంలో ఎందుకు కనబరచడం లేదన్నది ఒక ప్రశ్న. కేసు విచారణ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నట్టు? కర్నూలు ఎస్పీతో సంప్రదింపులు ఎందుకు జరుపుతున్నట్టు? కఠిన చర్యలకు ఉపక్రమిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థకు ఏపీ పోలీస్ శాఖ ఎందుకు సాయమందించట్లేదు? ఇవన్నీ సీబీఐ నుంచి ఎదురవుతున్న చిక్కుముడులే.  ఇవన్నీ సీబీఐ ఉదాసీనత విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలే.

సీబీఐకి మించి అవినాష్ రెడ్డి వైపు కూడా తప్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఆరుసార్లు పిలిస్తే విచారణకు హాజరైన ఆయన.. ఏడోసారి పిలిస్తే ఎందుకు వెళ్లనట్టు? తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైతే హైదరాబాదో, బెంగళూరో తీసుకెళ్లాలే తప్ప కర్నూలు ఎందుకు తీసుకొచ్చినట్టు? ఆస్పత్రి ఎదుట వైసీపీ బ్యాచ్ ను ఎందుకు కాపలా పెట్టినట్టు? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పడం దేనికి సంకేతం? ఇలా అవినాష్ శిబిరం నుంచి సైతం తప్పులు మీద తప్పులు జరుగుతునే ఉన్నాయి. అయితే ఈ చర్యలన్నీ జగన్ సర్కారు ఒత్తిడి పుణ్యమేనని ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది.

ప్రజల్లోకి ఇష్యూ బలంగా వెళ్లిపోయినట్టు జగన్ సర్కారు గుర్తించింది. అందుకే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే… ఆయనే సీబీఐ విచారణకు హాజరయ్యేలా అవినాశ్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేస్తే చేసుకోని! తర్వాత చూసుకుందాం. జగన్‌ కూడా 16 నెలలు జైలులో ఉన్నారు కదా! ఇప్పుడు జరుగుతున్న తంతుతో నీకూ చెడ్డపేరు. మాకూ ఇబ్బంది అని అవినాశ్‌కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నాటికి దీనికి ఒక ఎండ్ కార్డు పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.