YCP in Pawan Trap : ఏపీలో ఇప్పుడు ఎవరి ట్రాప్ లో ఎవరు పడ్డారు? వైసీపీ ట్రాప్ లో పవన్ పడ్డారా? పవన్ ట్రాప్ లో వైసీపీ చిక్కుకుందా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే దీనిపై ఎవరికి వారు అన్వయాలు ఇస్తున్నా, సరికొత్త విశ్లేషణలు చేస్తున్నా ఒకటి మాత్రం నిజం. వలంటీర్ల వ్యవస్థపై గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుండడం వాస్తవం. మంచి జరిగి ఉంటే మంచి మాట్లాడుతున్నారు. అటు చెడు సైతం వెలుగులోకి వస్తోంది. అంటే పవన్ ఈ విషయంలో సక్సెస్ అయినట్టే కదా. ఈ వ్యవస్థ ద్వారా చెడు కూడా జరుగుతోందని బయటపెట్టినట్టే కదా? రూ.5 వేలు జీతాన్ని అదే జీవితంగా భావిస్తున్న వలంటీరుపై సానుభూతి చూపుతూనే.. వలంటీరు వ్యవస్థ ద్వారా జగన్ పొలిటికల్ స్ట్రాటజీని పవన్ బయటపెట్టారు.
బలమైన సమాంతర వ్యవస్థగా వలంటీర్ల వ్యవస్థను జగన్ తీర్చిదిద్దారు. దానిని ప్రజలపై వదిలారు. ఆ వ్యవస్థ ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లింది. కేవలం రూ.5 వేల జీతంతో వారిని కట్టిపడేశారు. అతేంద్రియమైన శక్తిని వారికి కట్టబెట్టారు. వారిని కట్టుబానిసలు చేసుకున్నారు. అయితే వారికిచ్చిన శక్తిని తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ మార్చారన్న వ్యూహాన్ని పవన్ బయటపెట్టగలిగారు. ఆ వ్యవస్థ ద్వారా జరుగుతున్న ఉపయోగాలు కంటే.. చెడు దాగి ఉందన్న విషయాన్ని ప్రజలు గ్రహించేలా చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారు.
వలంటీర్ల వ్యవస్థ విషయంలో పవన్ యధాలాపంగా మాట్లాడలేదు. పూర్తి స్టడీ చేసే రంగంలోకి దిగారు. దాని పర్యవసానాలు, ఫలితాలు ఆలోచించాకే ఆరోపణలు చేశారు. వాటినే కంటిన్యూ చేస్తున్నారు. ఆ వ్యవస్థ వెనుక ఉన్న జగన్ బయటకు రావాలన్నదే పవన్ అభిమతం. అందుకే తనపై వలంటీర్లు, వైసీపీ నేతలు ఎన్ని ఆందోళనలు చేసినా వెనక్కి తగ్గలేదు. తానెందుకు అలా మాట్లాడానో వివరణ ఇస్తూనే.. అదే వ్యవస్థపై పోరాటం ప్రకటించడం వెనుక పవన్ వ్యూహం గట్టిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు విమర్శలు సైతం సదాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ సునామీకి వైసీపీ విరుగుడు చర్యలు కొట్టుకుపోయాయి. పవన్ దూకుడు ముందు వైసీపీ కౌంటర్ అటాక్ కూడా పనిచేయలేదు. వందీ మాగధులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినా పెద్దగా వర్కవుట్ కాలేదు. చివరకు కోర్టులో కేసులు వేసే మంగళగిరి ఎమ్మెల్యే రామక్రిష్ణారెడ్డి వినూత్న ఆలోచన చేశారు. దళిత వలంటీరు కాళ్లు కడిగారు. అది వర్కవుట్ కాలేదు. ప్రజల్లోకి వెళ్లలేదు. పవనూ వెనక్కి తగ్గలేదు. దీనిపై జగన్ రిప్లయ్ ఇచ్చే వరకూ ఇష్యూను కొనసాగిస్తానన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ అనుకున్నది సాధించారు. చివరి వరకూ ఒకే లైన్ తో ముందుకు సాగుతున్నారు. ఎటొచ్చి జగనే వలంటీర్లు, తన వందీమాగధులను ముందులో పెట్టి రాజకీయం చేస్తున్నారు.