YCP: గోదావరిలో వైసీపీ ఆకర్ష్.. జనసేన కీలక నేత పై ఫోకస్

జనసేనతో తెలుగుదేశం పొత్తు నేపథ్యంలో ఆ కూటమికి గోదావరి జిల్లాల్లో భారీ మెజారిటీ దక్కుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో వైసిపి అలర్ట్ అయ్యింది.

Written By: Dharma, Updated On : March 2, 2024 11:57 am

YCP

Follow us on

YCP: వైసిపి ఆకర్ష్ ఆపరేషన్ ను ప్రారంభించింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు తనకోసం పరోక్షంగా పనిచేసిన వారిని వైసిపిలో చేర్చుకునే పనిలో పడింది. అందులో భాగంగానే హరి రామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఇప్పటికే వైసీపీలో చేరారు. అటు ముద్రగడ కుటుంబ సభ్యులను సైతం పార్టీలోకి చేర్పించే ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు జనసేన కీలక నేతను వైసీపీలోకి రప్పించేందుకు కోవర్టు ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా ఎమ్మెల్యే టికెట్ తో పాటు మంత్రి పదవి ఇచ్చేందుకు సదరు నేతకు ప్రలోభం పెట్టినట్లు సమాచారం.

జనసేనతో తెలుగుదేశం పొత్తు నేపథ్యంలో ఆ కూటమికి గోదావరి జిల్లాల్లో భారీ మెజారిటీ దక్కుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో వైసిపి అలర్ట్ అయ్యింది. ఆ రెండు పార్టీల పొత్తునకు సంబంధించి విచ్ఛిన్నం చేసేందుకు చివరి వరకు ప్రయత్నం చేసింది. అటు సక్రమంగా ఓట్ల బదలాయింపు జరగకూడదని భావించింది. అందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో బలమైన కాపు సామాజిక వర్గం నేతలను వైసీపీలోకి చేర్పించే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జనసేనలో కీలక నాయకుడు వైసీపీలో చేరొచ్చని ప్రచారం ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతోంది.

తొలుత ఓ నియోజకవర్గానికి అభ్యర్థిగా జనసేన నాయకుడి పేరు ప్రకటించారు. కానీ టిడిపి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. పవన్ సదరు నాయకుడికి వేరే నియోజకవర్గం సూచించినట్లు తెలుస్తోంది. అక్కడ గాని తేడా కొడితే ఆ నాయకుడిని నేరుగా వైసీపీలో చేర్పించే విధంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేనకు ఇంకా 19 సీట్లు కేటాయించాల్సి ఉంది. అటు 50 స్థానాల వరకు టిడిపి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ లెక్కన టిక్కెట్లు దక్కని నాయకులను నేరుగా వైసీపీలోకి రప్పించాలన్నది పెద్దల ప్లాను. ఇప్పుడు అదే పనిగా ఐప్యాక్ టీం పావులు కదుపుతున్నట్లు సమాచారం. సీట్లు విషయంలో అసంతృప్తికి గురయ్యే జనసేన నేతలను ఈ టీం టార్గెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వారిని వైసీపీలోకి రప్పించి కూటమి ఓటు బ్యాంకుకు గండి కొట్టాలన్నది ప్లాన్. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.