YCP: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) దేనిని సీరియస్ గా తీసుకోవడం లేదు. తాను బెంగళూరులో ఉంటాను మీరు పోరాటం చేయండి అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. కూటమి ప్రభుత్వంపై పిలుపునిచ్చిన ఒక్క ఆందోళన కార్యక్రమంలో సైతం జగన్మోహన్ రెడ్డి కనిపించలేదు. ఆయన ఎప్పుడూ ప్రెస్ మీట్లకు పరిమితం అవుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి 175 నియోజకవర్గాల నేతలతో టచ్ లోకి వస్తున్నారు. వారికి ఆదేశాలు ఇచ్చి ఏవేవో కార్యక్రమాలను చేయిస్తున్నారు. వాటినే గ్రాండ్ సక్సెస్ అని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. అనుకూల మీడియాలో చెప్పిస్తున్నారు. అయితే తాజాగా కోటి సంతకాల కార్యక్రమం పూర్తయిందని.. ఆ కోటి సంతకాలను రాష్ట్ర గవర్నర్కు నివేదిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ కోటి సంతకాలపై రకరకాల ప్రచారం సాగుతోంది.
* 100 నియోజకవర్గాల్లో..
రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు. కోటి సంతకాలు అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు విధిగా సంతకం చేయాలి. ఇప్పుడు కోటి సంతకాలు పూర్తయ్యాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెబుతోంది. అయితే ఈ సంతకాలు ఎలా చేశారు అన్నది ఇప్పుడు ప్రశ్న. పైగా దాదాపు 100 నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తల అంతంత మాత్రమే. చాలామంది నేతలు నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ అందుబాటులో రావడం లేదు. అటువంటి చోట్ల ప్రజలు సంతకాలు చేశారా? ఏదో యాంకర్ శ్యామల లాంటి వారు హైదరాబాదులో శిబిరాలు నిర్వహించి సంతకాలను సేకరించారు. పోనీ ఆమెలా ఏపీలో ఏ నియోజకవర్గంలో అటువంటి ప్రయత్నం జరిగింది? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది కూడా.
* చాలా రకాల సందేహాలు..
జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాలు అనేసరికి అనేక రకాల సందేహాలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసిందని ఈ సంతకాలు అని చెప్పుకొచ్చారు. కానీ గతంలో ఆయన తుఫాన్లు సంభవించిన సమయంలో సైతం కోటి రూపాయల విరాళం ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఖర్చుపెట్టిన దాఖలాలు కూడా లేవు. ఎవరైనా ముఖ్యమంత్రి సహాయనిధికి సాయం అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తానే సొంతంగా ఖర్చు పెడతానని చెప్పి కొంచెం కొంచెం తిట్లు పంపించి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు అదే మాదిరిగా కోటి సంతకాల సేకరణ ఉంటుందని సెటైర్లు పడుతున్నాయి. ఏదైనా పార్టీ కార్యక్రమం చేసినప్పుడు సీరియస్గా చేయాలి తప్ప.. ఇలా చేస్తే మాత్రం వికటించే పరిస్థితిలే అధికం. ఆ అంశంపై ఉన్న సీరియస్ నెస్ తగ్గుతుంది.