YCP – GVL : వైసీపీతో నడుపుతున్న బంధం బీజేపీ కొంప ముంచుతుందా? ఏపీలో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకోకుంటే బీజేపీకి ఒక్క సీటు రావడం కూడా కష్టమే. ఒంటరిగా వెళితే ఉనికి చాటుకోవడం కూడా ఇబ్బందికరమే. ఇటువంటి సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బీజేపీ నేతలు అక్కడో మాట..ఇక్కడో మాట మాట్లాడుతున్నారు. పార్టీ బలం పెంచుకోలేక.. మూల్యం చెల్లించుకుంటున్నారు. మొన్నటికి మొన్న కావలిలో సీఎం జగన్ సభలో నిరసన తెలిపేందుకు వెళ్లిన బీజేపీ నాయకులపై పోలీసులు ప్రతాపం చూపారు. ఓ నాయకుడి తలను పోలీసులు రెండు కాళ్ల మధ్యపెట్టి నలిపేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అది అక్కడి ఫొటో కాదన్న కామెంట్స్ వినిపించాయి. కానీ అందుకు తగ్గట్టు వీడియోలు బయటకు రావడంతో కావలి సభలోనే అని కన్ఫర్మ్ అయ్యింది.
ఈ ఘటనకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే దౌర్జన్యానికి దిగడం దారుణమని వ్యాఖ్యానించారు.విశాఖ నుంచి రాజకీయాలను నడపాలనుకుంటున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అయితే సింహంలా విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలపై దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. సాయంత్రంలోపు అంటూ దానికి గడువు కూడా పెట్టారు. కానీ నరసింహరావు పొలి కేకలను వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. చాలా లైట్ తీసుకున్నట్టుంది. రోజులు గడుస్తున్నా దాని గురించి ఆరాతీయడం కూడా లేదు.
వైసీపీతో చాలా మంది బీజేపీ నాయకులకు మంచి సంబంధాలే ఉన్నాయి. లోపయికారీగా సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. అటువంటి నాయకుల జాబితాలో జీవీఎల్ ముందుంటారు. అటువంటి నేత వైసీపీ సర్కారుకు గడువు విధించడాన్ని బీజేపీ శ్రేణులు కూడా లైట్ తీసుకుంటున్నాయి. అదంతా పొలిటికల్ గేమ్ గా అభివర్ణిస్తున్న వారూ ఉన్నారు. కాషాయదళంలో పెద్ద నాయకుల పరిస్థతి బాగున్నా.. వీధి పోరాటాలు చేసే చిన్న నాయకుల పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. కావలి ఎపిసోడ్ తరువాత అస్సలు వైసీపీ సర్కారుపై పోరాడేందుకు చాలా మంది బీజేపీ కార్యకర్తలు ముందుకు రావడం లేదు. నాయకులు ఒప్పందం చేసుకొని తమను బలి పశువు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రాలు దాటుతున్నా జీవీఎల్ డిమాండ్లేవీ వర్కవుట్ కాలేదు. మరి జీవీఎల్ ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.