YS Jagan  : ఇంట ఓడిపోతే.. అది కోల్పోతే జగన్ కు అవమానమే.. ఏం చేయనున్నాడు?

వైయస్ కుటుంబానికి కడప జిల్లా పెట్టని కోట. దశాబ్దాలుగా ఆ జిల్లాపై పట్టు సాధిస్తూ వస్తోంది ఆ కుటుంబం. కానీ ఈ ఎన్నికల్లో ఆ పట్టు తప్పింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను.. వైసిపి మూడింటికే పరిమితం అయ్యింది. ఇప్పుడు కడప జడ్పీ పీఠాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Written By: Dharma, Updated On : August 22, 2024 7:16 pm

Kadapa ZP Chairmen Post

Follow us on

YS Jagan : కడప జడ్పీ స్థానంపై టిడిపి కన్నేసిందా? ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తోందా? ఈ విషయంలో జగన్ జాగ్రత్త పడ్డారా? సొంత పార్టీ జడ్పిటిసి లకు ఆర్థిక సాయం చేశారా? వారికి భరోసా ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసిపి దూకుడు కనబరిచింది. అధికారంలో ఉన్న కూటమికి అవకాశం లేకుండా చేయాలని భావించింది. సీనియర్ నేత బొత్సను రంగంలోకి దించింది. అయితే బలం లేని చోట అభ్యర్థిని ప్రకటించి.. పొరపాటున ఓడిపోతే అబాసుపాలు అవుతామని చంద్రబాబు వెనక్కి తగ్గారు. అక్కడ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో వైసీపీకి ఏకగ్రీవం అయింది. బొత్స ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఇప్పుడు టిడిపి నేరుగా జగన్ పై గురిపెట్టినట్లు తెలుస్తోంది. కడప జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రత్యేక వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. 50 జెడ్పిటిసిలకు గాను.. ఒక్కచోట మాత్రమే టిడిపి గెలిచింది. ఎన్నికలకు ముందు మరో నలుగురు జడ్పిటిసిలు టిడిపిలో చేరారు. బిజెపిలో ఒక జడ్పిటిసి చేరారు. వైసీపీ వద్ద 40 మంది జడ్పిటిసి వరకు ఉన్నారు. టిడిపికి మరో 20 మంది జడ్పిటిసిల మద్దతు దొరికితే మాత్రం కడప జడ్పీ పీఠం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నట్టే.

* రేసులో పుత్తా నరసింహారెడ్డి
కడప జడ్పీ చైర్మన్ రేసులో కమలాపురం టిడిపి నాయకుడు పుత్తా నరసింహారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. వైసిపి మూడు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. గెలిచిన వారిలో జగన్ ఒక్కరే నమ్మకం. ఎందుకంటే ఆయన వైసీపీ అధినేత కాబట్టి. మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారే ఛాన్స్ కనిపిస్తోంది. అంతకంటే ముందే జెడ్పి పీఠాన్ని కైవసం చేసుకుని జగన్ కు దెబ్బతీయాలని టిడిపి భావిస్తోంది.

* జడ్పిటిసిలతో జగన్ భేటీ
ఇటీవల జడ్పిటిసి లను తీసుకుని తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు జిల్లా వైసీపీ నేతలు. అక్కడ వారితో జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పార్టీకి భవిష్యత్తు ఉంటుందని.. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు. జడ్పిటిసి లకు ఆర్థికంగా కొంత మొత్తం అందించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా పుత్తా నరసింహారెడ్డి పేరును జగన్ స్వయంగా ప్రకటించినట్లు సమాచారం. ఆయనను జడ్పీ అభ్యర్థిగా టిడిపి తెరపైకి తెచ్చి అవకాశం ఉన్నట్లు అదే సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.

* అతి కష్టమే
ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప జడ్పీ స్థానాన్ని నిలబెట్టుకోవడం జగన్ కు అత్యంత కష్టమైన పని. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీలో కౌన్సిలర్లు సైతం పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గంపై వైయస్ కుటుంబానికి ఉన్న పట్టు పోవడం ఖాయం. జడ్పీ పీఠం పోగొట్టుకున్నా.. వైయస్ కుటుంబ చరిత్ర మసకబారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ కడప జడ్పీ పీఠాన్ని కాపాడుకోగలరో? లేదో? చూడాలి.