Yatra 2: ‘యాత్ర 2’ని దెబ్బ కొట్టిన వైసీపీ క్యాడర్

యాత్ర 1 సమయంలో సినిమా చూసేందుకు పార్టీ శ్రేణులు చాలా ఆసక్తి కనబరిచాయి. పార్టీ నేతలు సొంత డబ్బులు పెట్టి ప్రజలకు ఉచితంగా చూపించారు. అటు ఉచితమే కదా అని భావించిన ప్రజలు ధియేటర్ కు వచ్చి సినిమాను చూశారు.

Written By: Dharma, Updated On : February 11, 2024 1:48 pm

Yatra 2

Follow us on

Yatra 2: యాత్ర 2 సినిమాపై వైసీపీకి చాలా అంచనాలు ఉన్నాయి. ఎన్నికల ముంగిట ఇదో అడ్వాంటేజ్ గా మారుతుందని ఆ పార్టీ భావించింది. అయితే అది అంత ఈజీ కానట్లు తెలుస్తోంది. ఎక్కడా థియేటర్లు నిండడం లేదు. చాలా థియేటర్లలో ముందు వరుస కుర్చీలు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా టికెట్లు కొనుగోలు చేసి పార్టీ శ్రేణులకు ఉచితంగా చూపించాలని ఎమ్మెల్యేలకు, ఇన్చార్జులకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. కానీ వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కనీసం పట్టించుకోవడం లేదు.

యాత్ర 1 సమయంలో సినిమా చూసేందుకు పార్టీ శ్రేణులు చాలా ఆసక్తి కనబరిచాయి. పార్టీ నేతలు సొంత డబ్బులు పెట్టి ప్రజలకు ఉచితంగా చూపించారు. అటు ఉచితమే కదా అని భావించిన ప్రజలు ధియేటర్ కు వచ్చి సినిమాను చూశారు. ఇప్పుడు యాత్ర 2 విషయంలో కూడా అదే జరుగుతుందని వైసిపి నాయకత్వం భావించింది. కానీ ద్వితీయ శ్రేణి క్యాడర్ పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. కలెక్షన్లు కనీస స్థాయిలో కూడా రాలేదు. పార్టీపై కానీ, అధినేతపై అభిమానంతో కానీ సినిమా చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. కార్యకర్తలే రాకపోతే.. ఇది ఫక్తు రాజకీయ చిత్రమని అందరికీ తెలుసు కాబట్టి.. వినోదాన్ని కోరుకునే సగటు ప్రేక్షకుడు ముందుకు రావడం లేదు.

ఏపీలో అధికార పార్టీ అనుబంధ సినిమా కాబట్టి.. ఆ పార్టీ శ్రేణులు వచ్చి సినిమాను చూస్తాయని చిత్ర యూనిట్ వర్గాలు భావించాయి. కానీ కలెక్షన్లు ముందుకు కదలడం లేదు. తొలిరోజు రెండు కోట్ల రూపాయల నెట్ వచ్చింది. అందులో సగం గుంటూరు నుంచి వచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి విడుదల రజిని నియమితులు కావడంతో.. ఆమె ఖాతాలో ఆ కలెక్షన్ పడింది. మిగతా చోట్ల మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. కనీసం కొత్త సమన్వయకర్తలు నియమితులైన చోట సైతం థియేటర్లు ఖాళీగా కనిపించడం విశేషం. పోనీ కడప జిల్లాలోనైనా కలెక్షన్లు బాగున్నాయి అంటే.. అక్కడ కూడా పూర్ పెర్ఫార్మన్స్.

యాత్ర 1 సమయంలో జగన్ ను అధికారంలోకి తీసుకురావాలన్న కసి క్యాడర్ లో కనిపించేది. దీంతో వారిని ప్రోత్సహించి తాము కూడా పదవి కొట్టేయాలని నేతలు భావించేవారు. దీంతో విపరీతంగా ఖర్చు చేశారు. ప్రజలను థియేటర్లోకి తీసుకెళ్లి సినిమాలు చూపించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా సగటు వైసిపి కార్యకర్తకు ఏ లాభం లేకుండా పోయింది. చేసిన పనులకు బిల్లుల చెల్లింపు లేదు. అందుకే వంద రూపాయలు ఖర్చుపెట్టి ఎందుకు సినిమాకు వెళ్లాలని ప్రశ్నిస్తున్న వారే అధికం. యాత్ర 2కి అనుకున్నంత కలెక్షన్లు రాకపోవడంతో చిత్ర యూనిట్ ఓ రకమైన ఆందోళన చెందుతోంది. ఇందులో నటించిన నటులు సైతం ఏదో అనుకున్నామని.. ఏదేదో జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.