YCP Activist: మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. ఆ పార్టీ కోలుకునేందుకు చాలా సమయం కూడా పట్టింది. అయితే పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే క్రమంలో అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే ఇది పార్టీ శ్రేణుల్లోకి బలంగా వెళ్ళింది. ప్రభుత్వ వైఫల్యాలను పక్కన పెడితే.. ప్రభుత్వంపైనే దుష్ప్రచారం చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన ఓ వైసీపీ కార్యకర్త అయితే.. తాను దివ్యాంగుడునని.. తనకు జగన్ సర్కార్ పింఛన్ మంజూరు చేసిందని.. ఏరా ఇప్పుడు చంద్రబాబు సర్కార్ తొలగించింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే దీనిని గ్రహించిన ఆ గ్రామస్తులు ఆయన వికలాంగుడు కాదని నిర్ధారిస్తూ ఒక వీడియో పెట్టారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: ఏకకాలంలో రెండు పార్టీలతో.. జగన్ భలే బ్యాలెన్స్!
* దివ్యాంగుడు కాకపోయినా..
శ్రీ సత్యసాయి జిల్లా( Sri Sathya Sai district ) బుక్కపట్నం మండలం నార్సింపల్లికి చెందిన పాలయ్యగారి రమేష్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైన పిచ్చి. జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. ఆపై సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అయితే ఆయన దివ్యాంగుడే కాదు. కాళ్లు చేతులు సక్రమంగానే ఉన్నాయి. అయితే తనకు వచ్చే దివ్యాంగుల పింఛన్ ను అన్యాయంగా తొలగించారంటూ తప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో తన కుడి చేయి కనిపించకుండా వెనక్కి కట్టుకొని.. అసత్య ప్రచారానికి తెగబడ్డాడు. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టును వైసిపి విపరీతంగా ట్రోల్ చేసింది. నిజమైన లబ్ధిదారుడికి అన్యాయం చేసింది చంద్రబాబు ప్రభుత్వం అంటూ వైసీపీ శ్రేణులు కామెంట్లు చేయడం ప్రారంభించారు.
* పాత వీడియోలను బయటపెట్టిన గ్రామస్తులు..
అయితే ఈ ప్రచారాన్ని గమనించారు గ్రామస్తులు. అతని రెండు చేతులు, కాళ్లు బాగానే ఉన్నాయని తెలియజేసే పాత వీడియోలను( old videos) బయటపెట్టారు. దీంతో ఆయన బండారం బయటపడింది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. దీంతో రమేష్ గ్రామం నుంచి పరారయ్యాడు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై దృష్టి పెట్టారు. అతడి సోదరుడని పిలిచి ఆరా తీశారు. ఇటీవల దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ధారణ పరీక్షల్లో 40 శాతానికి తక్కువగా ఉన్న దివ్యాంగులకు నోటీసులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. పింఛన్లు తొలగిస్తున్నామని.. 40% వైకల్యం ఉందని నిర్ధారించుకుంటే పునరుద్ధరిస్తామని చెప్పింది. దీంతో అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ పింఛన్లపై రకరకాలుగా ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఈ రమేష్ అనే వ్యక్తి దివ్యాంగుడి రూపంలో తప్పుడు ప్రచారం చేశారు. అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం గ్రామం నుంచి పరారీ అయ్యారు.