Kavitha new party: రాజకీయాలలో శాశ్వతమైన స్థానాలు అంటూ ఎవరికి ఉండదు. ఏదో ఒక సందర్భంలో కొత్తదారి వెతుక్కోవాల్సి ఉంటుంది. కాకపోతే గులాబీ పార్టీలో కవితకు స్థిరమైన స్థానమే ఉండేది. కానీ అనుకోకుండా చోటు చేసుకున్న పరిణామాలు ఆమె స్థానాన్ని ప్రశ్నార్థకం చేశాయి.. అంతేకాదు ఆమె బయట పెడుతున్న సంచలన నిజాలను తట్టుకోలేక అధిష్టానం బయటికి పంపించింది. దీంతో ఆమె తనకంటూ ఒక సొంత రాజకీయ క్షేత్రాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
తెలంగాణ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం అయితే కవిత కొత్త రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని తెలుస్తోంది. దీపావళికి ఆమె తన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. కార్యకలాపాలు కొనసాగిస్తారని సమాచారం. ఇప్పటికే తన నివాసం ఉండే ప్రాంతంలో మూడు అంతస్తుల బంగ్లాను ఆమె అద్దెకి తీసుకున్నారు. అక్కడినుంచి కార్యకలాపాలు మొదలుపెడతారు. ఇటీవల తన జాగృతికి సంబంధించిన జిల్లాల నాయకత్వాలను ఆమె ప్రకటించారు. ఇంకా కొన్ని జిల్లాల నాయకత్వాలు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు ఇటీవల తన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో లీడర్ అనే కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ కవులను, కళాకారులను జాగృతి ఆధ్వర్యంలో సన్మానించారు. ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు.
బీసీల హక్కుల కోసం.. బీసీల రిజర్వేషన్ల కోసం ఆమె కొద్దిరోజులుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా తండ్రి నీడ నుంచి బయటికి వచ్చారు కాబట్టి కవిత తన రాజకీయ లక్ష్యాన్ని స్పష్టంగా చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే ఒక రాజకీయ పార్టీ నడవాలంటే ఖచ్చితంగా నాయకులు ఉండాలి. కార్యకర్తలు కూడా ఉండాలి. క్షేత్రస్థాయిలో బలం ఉండాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ కవితకు సాధ్యమవుతాయా.. కవిత రాజకీయ పార్టీ పెడితే ఆమెతో వెళ్లే వారు ఎవరు.. అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఇటీవల కవితపై ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. అయితే ఆ వ్యాఖ్యలను కేవలం సిరికొండ మధుసూదనా చారి మాత్రమే ఖండించారు. అంతేతప్ప గులాబీ పార్టీ నుంచి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు కవిత సొంత రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆమెతో వచ్చేవారు.. ఆమెతో ఉండేవారు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆమెను సోషల్ మీడియాలో గులాబీ పార్టీ నాయకులు అన్ ఫాలో చేస్తున్నారు. రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటిని తట్టుకొని నిలబడగలరా.. నిలబడి రాజకీయం చేయగలరా.. అనే ప్రశ్నలు ఇప్పుడు కవిత ముందు ఉన్నాయి. వీటికి సమాధానం రోజులు గడిస్తే గాని తెలియదు.