NRI: సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. కొందరు టీడీపీలోకి, మరికొందరు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా తానా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా) ఫౌండేషన్ మాజీ చైర్మన్, బోర్డు మాజీ సభ్యుడు, గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకటరమణ వైసీపీలో చేరారు. నంబూరులో ముఖ్యమంత్రి జగన్ శనివారం ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించిన యార్లగడ్డ వైసీపీలో చేరడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
పార్టీ గెలుపు కోసం కృషి..
అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ తన సేవలను 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వినియోగిస్తానని తెలిపారు. నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న వెంకటరమణ వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్యరామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, గౌతంరెడ్డి తదితరులను కలిసి పార్టీ గెలుపుకు సాయాన్ని అందిస్తానని తెలిపారు.
నెల రోజులు రాష్ట్రంలో పర్యటన..
ఇక వెంకటరమణ నెల రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని కోరుతున్నారు. వైసీపీ విధానాలు నచ్చి ఓటు అడుగుతున్నట్లు తెలిపారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన చేపడుతున్న పథకాలు ప్రజలకు మరింత చేయూతనిస్తాయని ప్రచారం చేస్తున్నారు. జగన్ ఏపీకి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు.
వైసీపీలోకి ఎన్నారైలు..
విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రులు చాలా మంది వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు వెంకటరమణ తెలిపారు. జగన్ గెలుపునకు అందరూ సహకరించాలని ఆయన కోరుతున్నారు. వైసీపీకి ఓటు వేయడానికి అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ విజయమే అజెండాగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.