Jagan Narsipatnam Tour: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) ఉత్తరాంధ్ర పర్యటనకు రానున్నారు. ఓటమి ఎదురైన తర్వాత ఆయన వ్యక్తిగత పరామర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు. మధ్యలో ఓసారి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. మరోసారి గోదావరి జిల్లాల్లో వరద బాధితులను పరామర్శించారు. అంతకుమించి ప్రజా సమస్యలపై ఆయన స్పందించింది లేదు. అయితే తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 9న నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అక్కడ నుంచే ప్రభుత్వంపై సమరానికి పిలుపునివ్వనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఓ ముగ్గురు నేతలపైనే ప్రధానంగా టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ నెల 9న ఏకంగా 60 కిలోమీటర్ల పాటు రోడ్ షో నిర్వహించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి రోడ్ షో కొనసాగనుంది.
* స్పీకర్ పై గుస్సా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేశారు. కానీ అందులో ఐదింటి నిర్మాణం మాత్రమే పూర్తయింది. మిగతా వాటిని కూటమి ప్రభుత్వం పూర్తిచేసే క్రమంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయించింది. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ వచ్చారు. ఇప్పుడు నేరుగా పోరాటానికి దిగారు. అయితే అనూహ్యంగా నర్సీపట్నం ఎంచుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉంది. నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. తనకు ప్రత్యేక హోదా విషయంలో స్పీకర్ జాప్యం చేస్తుండడం.. అసెంబ్లీ వేదికగా విమర్శలు చేస్తుండడాన్ని సవాల్ గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని సందర్శించి స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసే అవకాశం ఉంది.
* స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు..
ఈ నెల 9న విశాఖ ఎయిర్పోర్ట్( Vishakha airport ) నుంచి రోడ్డు మార్గం గుండా జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం చేరుకుంటారు. అయితే గాజువాక పరిధిలో స్టీల్ ప్లాంట్ ఉంది. గత కొన్ని నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కార్మిక సంఘం నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ను వారికి వివరించే ప్రయత్నం చేస్తారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న టిడిపి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నియంత్రణ విషయంలో విఫలమైందని ఆరోపించే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గం పరిధిలో వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆయనను టార్గెట్ చేసే అవకాశం ఉంది.
* మత్స్యకారులకు మద్దతు..
మరోవైపు వంగలపూడి అనిత రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నారు. ఆమె పాయకరావుపేట( paayaka rao peta ) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిని మత్స్యకార సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో మత్స్యకార సంఘాల ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. వారికి మద్దతు తెలిపే పరిస్థితి కనిపిస్తోంది. కాలుష్యంతో ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన ఈ పరిశ్రమ ఏర్పాటుతో.. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో వారి పోరాటానికి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన సంచలనాలకు వేదిక కానుందన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో?