AP Politics: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో కూటమి పాలన సాగిస్తోంది. ప్రభుత్వం తన పని తాను చేస్తోంది. కానీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష పాత్ర లేకుండా పోయింది ఏపీలో. తమకు 40 శాతం ఓట్లు ఇస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వరా అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. తమకు ప్రత్యేక హోదా అనే ఆయుధం ఇస్తే కానీ తాము పోరాటం చేయలేమని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలో ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ మద్యం వ్యవహారంలో.. ఏకంగా టిడిపి నేతలపై వేటు వేసే పరిస్థితికి తీసుకొచ్చారు ప్రజా ప్రతిపక్ష వాదులే. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను, నేతల అవినీతిని బయట పెడుతున్నారు. ప్రభుత్వం చర్యలకు దిగే అనివార్య పరిస్థితి తీసుకొస్తున్నారు.
* ప్రెస్ మీట్, ప్రెస్ నోట్ తో సరి..
కూటమి ప్రభుత్వం( Alliance government ) పాలనతో ముందుకు సాగుతోంది. అలాగని ప్రభుత్వ వైఫల్యాలు లేవని చెప్పలేం. కానీ ఉన్న వాటిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం లేదు. ప్రెస్ మీట్ పెట్టి.. ప్రెస్ నోట్ జారీ చేసి చేతులు దులుపుకుంటుంది. కేవలం ప్రతిపక్ష హోదా అనే అపర సంజీవిని కోసం వేచి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడినప్పుడు పోరాటం చేస్తేనే దాని ఫలితం ఉంటుంది. లేకుంటే అది పాత చింతకాయ మాదిరిగా మారిపోవడం ఖాయం. ఈ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతుంటే.. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.
* పరిష్కారంతో ప్రజల్లో సంతృప్తి..
గత కొంతకాలంగా ఒక పరిణామం బయటపడుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు బలపడడం కనిపిస్తోంది. ప్రజా కోణం నుంచి దృష్టి మరల్చకుండా వారు ఏమనుకుంటారో అన్న భయంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా రాకపోవచ్చు కానీ.. 40% ఓటు బ్యాంకు దక్కించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు. అయితే ఇటీవల తంబళ్లపల్లెలో నకిలీ మద్యం డంప్ పట్టుబడింది. ఎంతవరకు కూటమి పెద్దలకు ఇందులో హస్తము ఉందని ఆరోపణల వరకే కానీ.. దానిపై క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ నకిలీ డంపు మూలాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి ఉన్నవే. ఎన్నికలకు ముందు చేరిన వారే టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకుముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడలేకపోతోంది. కానీ ప్రజా ప్రతిపక్షం అలా కాదు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించేసరికి.. ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పలేదు. ఉల్లి ధరల సమస్యపై.. ఇతర సమస్యలపై ప్రజా ప్రతిపక్ష పాత్ర కనిపిస్తుంది తప్ప.. వారే వాయిస్ వినిపిస్తున్నారు తప్ప.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నపాటి మాట కూడా రావడం లేదు. ఇలా అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టం. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తోంది. ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతోంది. మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చోటేది? అంటే మాత్రం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి.