Jagan: రాజకీయం రాజకీయంగానే చేయాలి. రాజకీయ కోణంలోనే చూడాలి. ఎవరి అవసరం.. ఏ పార్టీ అవసరం ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే మిగతా రాజకీయ పార్టీలతో సభ్యత గానే ఉండాలి. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును( AP CM Chandrababu) మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన ప్రతి పార్టీతోను మంచి సంబంధాలే నడుపుతారు. ఏ పార్టీతో వైరం పెట్టుకోరు. ఆయన చరిత్ర తీసుకుంటే ఇట్టే అర్థం అవుతుంది. వైసిపి హయాంలో రాజకీయ సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆయనకు వామపక్ష నేతల మద్దతు లభించింది. విధానపరమైన అంశాల్లో తప్పించి.. వామపక్ష నేతలతో ఎప్పుడూ సఖ్యత గానే మెలుగుతారు. ఈసారి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వామపక్ష నేతల అభిప్రాయాలను గౌరవిస్తున్నారు. వారి వినతులను పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం కాస్త భిన్నం. తనకు ఎవరి అవసరం లేదని.. ప్రజా మద్దతు ఉందని ఇతర రాజకీయ పార్టీలను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు అది ఆయనకే శాపంగా మారింది.
* అప్పట్లో వామపక్షాలకు దూరం..
జాతీయస్థాయిలో ఎన్డీఏ( National democratic Alliance ) కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి అవతరించింది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు చూస్తోంది. కానీ అది అధికారికంగా కాదు. అయితే ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా కీలక భాగస్వాములు. అయితే ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షానికి వామపక్షాల బలం అవసరం. ప్రజా పోరాటాలు రాజకీయ పార్టీలు చేస్తే ప్రజలు ఒకలా కనెక్ట్ అవుతారు. అదే వామపక్షాలు, ప్రజా సంఘాలు చేస్తే ప్రజల్లోకి ఆ ఉద్యమ ఫలాలు బాగా వెళ్తాయి. అందుకే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు వామపక్షాలతో కలిసి పోరాటాలు చేశారు. ప్రజా పోరాటాల విషయంలో అందర్నీ కలుపుకొని వెళ్లేవారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా పోరాటాలకు ఇతర రాజకీయ పార్టీలకు పిలుపునివ్వడం మాత్రం విశేషం.
* ఆశించిన స్పందన లేదు..
అయితే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) పిలుపునకు వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. ప్రభుత్వ, ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో నిర్మిస్తామని సీఎం చంద్రబాబు క్యాబినెట్ భేటీలో వెల్లడించారు. అయితే అది పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రగా అభివర్ణించారు జగన్మోహన్ రెడ్డి. దీనిపై రాష్ట్రస్థాయిలో ఉద్యమించేందుకు సిద్ధపడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతున్నారు. కానీ సహకరించేందుకు కాంగ్రెస్ పార్టీ కానీ.. వామపక్షాలు కానీ ముందుకు వచ్చే అవకాశం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరి ఒక కారణం కాగా.. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యవహరించిన తీరు మరో కారణం.
* చాలా కారణాలు..
కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో( Delhi) పోరాటం చేశారు. ఆ సమయంలో కొన్ని జాతీయ పార్టీల నేతలు వెళ్లి సంఘీభావం తెలిపారు. ప్రధానంగా ఇండియా కూటమిలోని ఉన్న కీలక పార్టీల నేతలు వెళ్లి మద్దతు ప్రకటించారు. అయితే ఆ సమయంలో వామపక్ష నేతలు కానీ.. కాంగ్రెస్ పార్టీకి కానీ కనీస సమాచారం లేదు. నాడు జాతీయస్థాయిలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపిన పార్టీలు ఇప్పుడు ఏపీలో లేవు. ఉన్న పార్టీల విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారు. అందుకే ఇప్పుడు ప్రజా పోరాటాల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో అడుగులు వేసేందుకు కాంగ్రెస్, వామపక్షాలు ముందుకు రావడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్ట సమయం. నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహారాలే ఇప్పుడు ఆయనకు శాపంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.