Amaravathi Capital : కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో కొత్త సందడి నెలకొంది. ఫలితాలు వచ్చిన మరుక్షణం నాటి నుంచి అమరావతి ఒక రకమైన వైభవం చాటుకుంటూ వస్తోంది. జూన్ 4న ఫలితాలు వచ్చిన సాయంత్రం నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన నిర్మాణాలకు సంబంధించి.. రహదారుల చుట్టూ ఉన్న ముళ్లకంచెలను, పిచ్చి మొక్కలను తొలగించారు. విద్యుత్ లైట్లను సైతం వేశారు.అయితే అమరావతికి నిధులు ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. బడ్జెట్లో ఏకంగా 15 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. దీంతో నిధుల ఇబ్బందులు ఉండవని అంతా భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది గ్రాంట్ కాదని.. అది కేవలం రుణం మాత్రమేనని ప్రచారం ప్రారంభమైంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. అవి కేంద్రం భరోసాతో ఇచ్చేరుణం అని.. దానికి కేంద్రమే బాధ్యత వహిస్తుందని చెప్పుకొచ్చారు. అయినా ఆ నిధులపై సోషల్ మీడియాలో ప్రచారం ఆగలేదు. రకరకాలుగా ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఇవేవీ పట్టించుకోని ప్రపంచ బ్యాంకు బృందం రెండు మూడుసార్లు అమరావతిని సందర్శించింది. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సైతం అనుమతి లేఖను పంపించింది.
* గతంలో సైతం ఇదే మాదిరిగా
అయితే గతంలో సైతం ప్రపంచ బ్యాంకు నిధులు అందించేందుకు ముందుకు వచ్చింది. 2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో మూడు వేల కోట్ల రూపాయల సాయం కోసం టిడిపి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు అభ్యర్థించింది. ఉత్తర ప్రత్యుత్తరాలు సైతం జరిగాయి. అయితే అప్పట్లో వివిధ రూపాల్లో వైసీపీ దానిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ప్రపంచ బ్యాంకు పునరాలోచనలో పడింది. ఇక్కడ అస్తవ్యస్త రాజకీయాలు ఉన్నాయని భావించి రుణ మంజూరుకు ముందుకు రాలేదు. అప్పట్లో కేంద్రంతో టిడిపి ప్రభుత్వం విభేదించడం కూడా ఒక కారణం. అందుకే అప్పట్లో నిధుల విడుదలకు ప్రపంచ బ్యాంకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు అదే ప్రపంచ బ్యాంక్ ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు రావడం మాత్రం హర్షించదగ్గ పరిణామం.
* వెబ్ సైట్ లో స్పష్టత
ఇటీవల సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిఆర్డిఏ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అదే రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల సాయంపై స్పష్టతనిచ్చింది. ఏకంగా వెబ్సైట్లో విషయాన్ని పెట్టింది. అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల సాయం అందిస్తున్నామని.. దానికి బాధ్యులుగా భారత ప్రభుత్వాన్ని చూపింది. అంటే కేంద్రం చెబుతున్న మాదిరిగా ఆ ఆ రుణం తిరిగి చెల్లించే బాధ్యత కూడా కేంద్రానిదే. అదే విషయాన్నిస్పష్టం చేసింది ప్రపంచ బ్యాంక్. వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి చెక్ చెబుతూ ఏకంగా వెబ్సైట్లో పొందుపరచడం విశేషం. మొత్తానికైతే అమరావతి రాజధానిని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టమైంది. ప్రపంచ బ్యాంకు నిధులతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: World bank team visited amaravati and gave green signal for release of funds
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com