AP Politics : ఏపీలో రాజకీయం( AP politics) హీట్ పుట్టిస్తోంది. ఎన్నికలు జరిగి ఏడు నెలలు దాటుతోంది. ఇప్పుడప్పుడే ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. అయినా సరే పరిస్థితి వేడిగానే ఉంది. ప్రధానంగా వైసిపి నేతలు పెద్ద ఎత్తున గుడ్ బై చెబుతుండడం ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిపోవడం ఆ పార్టీకి లోటు. వైసీపీ శ్రేణులు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అధినేత విదేశాల్లో ఉండగా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పారు. వారి స్థానంలో కూటమి పార్టీల నేతలు రాజ్యసభ సభ్యులు అయ్యారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీ నుంచి మరో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతోంది. అయితే కూటమి పార్టీల్లో…ఏ పార్టీకి పదవి దక్కుతుంది అన్న చర్చ మొదలైంది.
* ఇప్పటికే ముగ్గురు రాజీనామా
ఎన్నికల్లో వైసీపీ( YSR Congress ) ఓడిపోయిన తర్వాత ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. అయితే ఈ ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. మోపిదేవి వెంకటరమణ తో పాటు బీదా మస్తాన్ రావు టిడిపిలో చేరారు. ఆర్ కృష్ణయ్య బిజెపికి మద్దతు ప్రకటించారు. అయితే రాజ్యసభ పదవికి పెద్దగా మొగ్గు చూపులేదు మోపిదేవి వెంకటరమణ. అయితే ఈ మూడు రాజ్యసభ స్థానాలను మూడు పార్టీలు సమానంగా తీసుకుంటాయని భావించారు. కానీ చివరి నిమిషంలో బిజెపి డ్రాప్ అయ్యింది. టిడిపికి రెండు రాజ్యసభ సీట్లు, బిజెపికి ఒకటి దక్కింది. టిడిపి నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ లకు పదవులు దక్కాయి. బిజెపి నుంచి మరోసారి కృష్ణయ్య నామినేట్ అయ్యారు.
* ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి
అయితే గతంలో ముగ్గురు బిసి వర్గానికి( backward caste ) చెందిన వారే కాగా.. ఇద్దరు బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో.. అదే సామాజిక వర్గానికి చెందిన నేతతో భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రాజ్యసభ పదవి కోసం అప్పుడే కూటమి పార్టీలో పోటీ ప్రారంభం అయింది. ఆశావహులు ఎవరికి వారే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ తరుణంలో ఢిల్లీ నుంచి బిగ్ అలెర్ట్ వచ్చింది. ఇప్పటికే అమిత్ షా చంద్రబాబుతో పాటు పవన్ నుంచి హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానాన్ని బిజెపికి విడిచి పెట్టాలని అమిత్ షా కోరినట్లు సమాచారం. అందుకు ఇద్దరు నేతలు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
* కిరణ్ కుమార్ రెడ్డికి ఛాన్స్
ఒకవేళ బిజెపికి ఈ రాజ్యసభ స్థానం ఇస్తే.. రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే మాత్రం ఆశావహులు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాజ్యసభ పదవికి కిరణ్ కుమార్ రెడ్డి ( Kiran Kumar Redd) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు మద్దతు ఉండడంతో ఆయన ఎంపిక లాంచనమేనని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఓటమి ఎదురయింది. వాస్తవానికి ఈ సీటు వైసీపీకి ఎంతో అనుకూలం. నేతలు బరిలో దిగేందుకు ఇష్టపడరు. అటువంటి చోట సాహసించి పోటీకి దిగారు కిరణ్ కుమార్ రెడ్డి. తప్పకుండా తనకు రాజ్యసభ ఇవ్వాలన్న హామీ తోనే అప్పట్లో పోటీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటు కిరణ్ కుమార్ రెడ్డి దేనని తేలిపోయింది. అయితే చివరిలో అనూహ్య పరిణామాలు జరిగితే కానీ.. కిరణ్ మార్పు ఉండదని తెలుస్తోంది.