YS Sharmila PCC President Post: వైయస్ షర్మిలకు( Y S Sharmila ) పదవి గండం ఉందా? ఆమెను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారా? బలమైన బీసీ మహిళా నేతకు ఆ పదవి ఇస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చిన తర్వాత పెద్దగా కలిసి రాలేదు. పార్టీలో ఉన్న నేతలు సైతం బయటకు వెళ్లిపోయారు. ఉన్న కొద్దిపాటి సీనియర్లు మౌనంగా ఉన్నారు. కేవలం షర్మిల వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళుతున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సోదరుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రమే ఆమె తన పదవిని అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారన్న విమర్శలు టాక్ అయితే ఉంది. అయితే ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఎదగడం లేదన్నది ప్రధాన ఆరోపణ. దీంతో ఆమె స్థానంలో కొత్త నేతను తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో సైతం ఇదే ప్రచారం జరుగుతోంది. షర్మిల మార్పు అనివార్యం అని మాత్రం తెలుస్తోంది.
Also Read: చంద్రబాబు సింగపూర్ టూర్ పై పెద్దిరెడ్డి ‘పెద్ద’ కుట్ర?
* తెలంగాణలో వర్కౌట్ కాకపోవడంతో.. తెలంగాణలో( Telangana) వైయస్సార్ పేరిట ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. ఆ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. కానీ ఆమె ఆశించిన స్థాయిలో అక్కడ ఆదరణ దక్కలేదు. దీంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు షర్మిల. అదే సమయంలో ఏపీలో పార్టీ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది. ఆపై సోదరుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు విభేదాలు పతాక స్థాయికి చేరాయి. దీంతో జగన్ విషయంలో షర్మిలకు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో షర్మిల జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ కూడా చేయగలిగారు. అయితే ఆ విషయం వరకు ఓకే కానీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల ద్వారా ఎటువంటి లాభం లేకుండా పోయింది. ఒక్కరంటే ఒక్క నేతను కూడా ఆమె ఆకర్షించలేకపోయారు. ఆపై సీనియర్లను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. అందుకే హై కమాండ్ కు ఆమెపై విపరీతమైన ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. అందుకే ఆమె మార్పు ఖాయమని తెలుస్తోంది.
* కృపారాణికి ఛాన్స్
షర్మిల స్థానంలో బీసీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి ( Killi Krupa Rani) అవకాశం ఇస్తారని తెగ ప్రచారం సాగుతోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు డాక్టర్ కిల్లి కృపారాణి. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. అప్పటికే కేంద్రమంత్రిగా ఉన్న కింజరాపు ఎర్రం నాయుడు పై పోటీ చేశారు. ఆయనకు గట్టి పోటీ ఇవ్వగలిగారు. 2009లో మరోసారి రాజశేఖర్ రెడ్డి ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె ఘనవిజయం సాధించారు. ఓటమి ఎరుగని ఎర్రం నాయుడు ను ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది వచ్చినా.. ఆ పార్టీని కృపారాణి వీడలేదు. 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేకపోయారు. తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు.
* కాంగ్రెస్ పెద్దల అనుగ్రహం..
కృపారాణి మంచి వాగ్దాటి కలిగిన నాయకురాలు. ఆపై వైద్యవృత్తి నుంచి వచ్చారు. కేంద్రమంత్రిగా పనిచేయడంతో పెద్దలతో సాన్నిహిత్యం ఉంది. రాహుల్ గాంధీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. షర్మిలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో ఆమెను తప్పించి కృపారాణికి అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.