Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మోహన్ అమెరికా వెళ్లారా? ఆయన తిరిగి ఇండియాకు రారా? ఇప్పట్లో వచ్చే ఉద్దేశం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సన్నిహిత వర్గాల నుంచి కూడా ఇదే మాట వినిపిస్తోందన్న టాక్ ప్రారంభమైంది. పోలింగ్ ముగిసిన వెంటనే చాలామంది నాయకులు విదేశాలకు వెళ్లారు. వారంతా కౌంటింగ్ కు ముందే తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ వల్లభనేని వంశీ పోలింగ్ ముగిసిందో.. లేదో అమెరికా వెళ్ళిపోయారు. మరో ఆరు నెలల పాటు అక్కడే ఉండిపోతారని ప్రచారం జరుగుతోంది. ఆయన సన్నిహిత వర్గాలు సైతం దీనినే ధృవీకరిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేశారు వంశీ. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచారు. 2019 ఎన్నికల్లో సైతం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించారు. వైసీపీలో చేరారు. చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేసుకున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా లోకేష్ పదో తరగతి విద్యార్థులతో జూమ్ యాప్ లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా చొరబడ్డారు. చాలా అవమానకరంగా మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫస్ట్ టార్గెట్ వల్లభనేని వంశీయేనని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అమెరికా వెళ్లినట్లు టాక్ నడుస్తోంది.
వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వంశీ విముఖత చూపారు. జగన్ బతిమిలాడేసరికి ఒప్పుకోవాల్సి వచ్చిందని వంశీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే ఎన్నికల్లో.. దుట్టా రామచంద్రరావు కుమార్తెను ఎమ్మెల్యేగా నిలుపుతామని ఇదే వంశీ ప్రకటించారు. అప్పటివరకు పకోడీ గాడు అంటూ దుట్టా రామచంద్ర రావు పై వంశీ విమర్శలు చేసేవాడు. కానీ నియోజకవర్గం లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వంశీ స్వరం మార్చారు. పోలింగ్ రోజు కూడా పెద్దగా హడావిడి చేయలేదు. టిడిపి అభ్యర్థి పై అటాక్ చేయగా.. దాంతో తనకు ఎటువంటి సంబంధం లేదని ముందుగానే ప్రకటించారు వంశీ. ఈ పరిణామాలన్నీ ఆయనలో భయాన్ని తెలియజేస్తున్నాయి అన్న టాక్ ప్రారంభమైంది. అందుకే ఏపీలో ఉండి టార్గెట్ కావడం కంటే.. అమెరికాలో ఉండి పోవడం శ్రేయస్కరం అన్న నిర్ణయానికి వల్లభనేని వంశీ రావడం విశేషం.