https://oktelugu.com/

TDP Candidates: ఆ రెండు చోట్ల టిడిపి అభ్యర్థులను మార్చుతారా?

ఈనెల 18 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. దానికి రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు వస్తున్న చంద్రబాబు.. పార్టీ శ్రేణులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : April 15, 2024 2:07 pm
    Will TDP change candidates in those two seats

    Will TDP change candidates in those two seats

    Follow us on

    TDP Candidates: చంద్రబాబు మంచి దూకుడు మీద ఉన్నారు. ఏడుపదుల వయసులో కూడా ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అటు భాగస్వామ్య పక్షాల నేతలతో కలిసి భారీ బహిరంగ సభలకు హాజరవుతున్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాసలో జరిగే ప్రజా గళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో రెండు సీట్ల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించనున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం వర్గాన్ని బిజెపికి కేటాయించారు. పాలకొండను జనసేనకు ఇచ్చారు. అయితే ఆ రెండు చోట్ల ఇబ్బంది లేకున్నా.. శ్రీకాకుళం, పాతపట్నం అసెంబ్లీ సీట్లలో కొత్త అభ్యర్థులను ప్రకటించారు. అక్కడ ఇన్చార్జిలను కాదని కొత్త నేతలను బరిలో దించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇన్చార్జులు ఎదురు తిరుగుతున్నారు. దీంతో అక్కడ అభ్యర్థులను మార్చుతారన్న ప్రచారం సాగుతోంది.

    ఈనెల 18 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. దానికి రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు వస్తున్న చంద్రబాబు.. పార్టీ శ్రేణులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. పలాసలో ప్రజా గళం పూర్తయిన తర్వాత.. రాత్రికి ఇక్కడే బస చేయనున్నారు. జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. ఒకవేళ ఆ రెండు స్థానాలకు అభ్యర్థులను మార్చుతామనుకుంటే మాత్రం ఆరోజు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులను కొనసాగించాలనుకుంటే.. అసంతృప్తులను సముదాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబం సుదీర్ఘకాలం టిడిపిలోనే కొనసాగుతూ వస్తోంది. అప్పల సూర్యనారాయణ, ఆయన భార్య లక్ష్మీదేవి ఇప్పటివరకు టిడిపి అభ్యర్థులుగా పోటీ చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా ఆ కుటుంబానికి టికెట్ అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా గొండు శంకర్ అనే యువకుడికి టికెట్ ఇచ్చారు. దీంతో గుండ కుటుంబం నుంచి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఎమ్మెల్యే అభ్యర్థిగాను, మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ ఎంపీ అభ్యర్థిగాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో హై కమాండ్ దూత వచ్చి వారితో చర్చలు జరిపారు. మెజారిటీ టిడిపి క్యాడర్ వారి వెంటే ఉండడంతో.. ఇక్కడ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు టిడిపిలో ప్రచారం జరుగుతోంది.

    మరోవైపు పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తిని కాదని.. మామిడి గోవిందరావు అనే కొత్త అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. అయితే గత నాలుగు దశాబ్దాలుగా కలమట కుటుంబం ఇక్కడ సేవలందిస్తోంది. సుదీర్ఘకాలం టిడిపిలోనే కొనసాగుతోంది. వెంకటరమణమూర్తి తండ్రి కలమట మోహన్ రావు ఐదుసార్లు పాతపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వెంకటరమణమూర్తికి కాదని మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చినా.. మెజారిటీ క్యాడర్ మాత్రం కలమట వెంటే ఉంది. ఈ విషయం టిడిపి హై కమాండ్ సైతం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చంద్రబాబు వస్తుండడంతో.. ఈ రెండు సీట్లలో అభ్యర్థుల మార్పు ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. అయితే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.