Homeఆంధ్రప్రదేశ్‌Hello AP Bye Bye YCP : పవన్ కళ్యాణ్ నినాదం పేలుతుందా?

Hello AP Bye Bye YCP : పవన్ కళ్యాణ్ నినాదం పేలుతుందా?

Hello AP Bye Bye YCP : ఏపీలో ఎన్నికల వ్యూహాల్లో రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. ప్రజాభిష్టానికి తగ్గట్టు హామీలు, మేనిఫెస్టోల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. ఎన్నికలకు పట్టుమని పది నెలలు లేకపోవడంతో కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ప్రజల ముందుకు ఎలా వెళ్లాలి? ఏయే హామీలు ఇవ్వాలి? వాటిని ప్రజలకు ఎలా వివరించాలి? అని ఆలోచిస్తున్నాయి. అదే సమయంలో ప్రజల్లోకి బలమైన స్లోగన్స్ పంపే పనిలో పడ్డాయి. గతంలో ఈ తరహా స్లోగన్స్ వర్కవుట్ అయ్యాయి. పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయి. ఇప్పుడు పవన్ కూడా అదే బాటలో పడ్డారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోకి తాజాగా ఒక నినాదాన్ని వదిలారు.

2014 ఎన్నికలు గుర్తున్నాయి కదూ. అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణకు, ఏపీకి వేర్వేరుగా ఎన్నికలు జరిగాయి. స్వరాష్ట్రం సాధించామన్న ఆనందంతో తెలంగాణ ఉండగా.. అవశేష ఏపీగా నష్టాన్ని మూటగట్టుకున్నామని ఆంధ్రా ప్రజలు బాధపడ్డారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని సగటు పౌరుడు ఆవేదనతో ఉన్నారు. అటువంటి సమయంలో టీడీపీ ఒక నినాదం ఇచ్చింది. ‘బ్రింగ్ బ్యాక్ బాబు’ అంటూ స్లోగన్ ప్రజల్లో గట్టిగానే పనిచేసింది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అనుభవశాలి అవసరమని ప్రజలు భావిస్తున్న తరుణంలో ఈ నినాదం బాగానే వర్కవుట్ అయ్యింది. విద్యార్థులు, యువత, విద్యావేత్తలను ఆలోచింపజేసింది. టీడీపీని అధికారం కట్టబెట్టింది.

గత ఎన్నికలు ముందు విపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ కాలం నడిచారు. అన్నివర్గాల వారిని కలిశారు. వారిలో నమ్మకం కలిగించారు. అదే సమయంలో ‘రావాలి జగన్..కావాలి జగన్ ’ అన్న నినాదాన్ని వైసీపీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అందరి మనసును తాకింది. దీంతో జగన్ కు ఒక చాన్సిద్దామన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేలా చేసింది. వైసీపీకి అంతులేని మెజార్టీకి ఈ నినాదం కూడా ఎంతగానో దోహదపడింది. కేవలం నినాదంగానే కాకుండా.. సగటు వైసీపీ అభిమాని గుండెచప్పుడుగా మారిపోయింది.

అయితే ఇప్పుడు పవన్ కూడా అటువంటి స్లోగన్ ఒకటి బయటకు పంపే ప్రయత్నం చేశారు. వారాహి యాత్రలో ‘హలో ఏపీ బైబై వైసీపీ’ అన్న నినాదాన్ని పవన్ వెల్లడించారు. వైసీపీ విముక్త ఏపీయే తన లక్ష్యమని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అవసరమైతే మిగతా రాజకీయపక్షాలను సైతం ఏకం చేస్తానని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ రూపొందించుకున్నారు. ఇప్పుడు ఆ అభిమాతానికి తగ్గట్టు కొత్త స్లోగన్ ఉండడంతో జన సైనికులు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. కచ్చితంగా ఇది ప్రజలకు ఆలోచింపజేసే విధంగా ఉందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. చూడాలి మరీ పవన్ స్లోగన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version