Pawankalyan : ఏపీలో ఇప్పుడు పవన్ సెంటరాఫ్ అట్రాక్షన్. రాజకీయాలు పవన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన కోర్టులో నడుస్తున్నాయి. బంతి ఎటువైపు తంతే అటువైపే అన్నట్టు సాగుతున్నాయి. అయితే ఆ బంతి ఎటువైపు? ఎలా నెట్టుతారు? అన్నదే ఇప్పుడు ప్రశ్న. అయితే ఇందులో ఎన్నో చిక్కుముళ్లు.. అవరోధాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఎలా దాటి వెళతారన్నదే ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ కాలం అవుతున్న దక్కని రాజకీయ ఫలాలు ఒక వైపు, వైసీపీ ఆరాచక పాలన నుంచి విముక్తి కల్పించాలన్న లక్ష్యం మరోవైపు, రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఒక వర్గం కలలను దరి చేర్చే అవకాశం ఒక వైపు.. ఇలా ఎన్నెన్నో సందేహాలు నడుస్తున్నాయి. వాటన్నింటికీ రేపటి ఎన్డీఏ మిత్రపక్ష సమావేశాల్లో జవాబు దొరుకుతుందని ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పవన్ కు ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి ఆహ్వానం అందింది. అంటే బీజేపీ తమకు నమ్మదగిన మిత్రుడిగా భావిస్తోంది. గతంలో ఎన్డీఏలో పనిచేసిన పార్టీలకు ఆహ్వానించినా.. టీడీపీని పక్కనపెట్టడం అంటే ఏపీలో బీజేపీ మరో ఆలోచనతో ఉందని తెలుస్తోంది. అది కచ్చితంగా జనసేనతో మాత్రమే కలిసి వెళ్లాలని అర్ధమవుతోంది. అయితే ఇందుకు పవన్ అంగీకరిస్తారా? లేదా? అనేదే ప్రశ్న. పవన్ ముందు చాలారకాలుగా చిక్కుముళ్లు ఉన్నాయి. జనసేన ఆవిర్భవించి దాదాపు పుష్కరకాలం అవుతోంది. చెప్పుకోదగ్గ విజయాలేవీ ఆ పార్టీ ఖాతాలో లేవు. ఈసారి కానీ రాజకీయంగా ప్రభావం చూపకుంటే శ్రేణుల్లో ధైర్యం కొరవడే అకాశం ఉంది.
బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే చెప్పుకోదగ్గ ఓట్లు, సీట్లు వచ్చే అవకాశముందా? క్షేత్రస్థాయిలో బీజేపీకి నాయకత్వం ఉందా? బూత్ స్థాయిలో నిలబడే వారు ఉన్నారా? అన్న అనుమానాలు పవన్ ను వెంటాడుతున్నాయి. టీడీపీకి దూరం చేసుకుంటే అది వైసీపీకి లాభం చేకూర్చినట్టవుతుందని పవన్ బలంగా నమ్ముతున్నారు. పోనీ రెండోస్థానంలోనైనా నిలబడగలిగే శక్తి రెండు పార్టీలకు ఉంటుందా? అంటే అదీ అనుమానమే. అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏకమవుతోంది. బీజేపీకి సవాల్ విసురుతోంది. ఒకవేళ జాతీయ స్థాయిలో బీజేపీ బలం తగ్గితే ఆ ప్రభావం ఏపీపై స్పష్టంగా పడుతోంది. అటువంటి సమయంలో తట్టుకోవడం చాలా కష్టమని పవన్ భావిస్తున్నారు.
పొరపాటున మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రావణకాష్టంగా మారుతుందని పవన్ భావిస్తున్నారు. వైసీపీ ఏలుబడిలో రాష్ట్రం నాశనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వనని శపధం చేశారు. ఇప్పుడు ఆ మాట తప్పుతారా? వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే పవన్ విశ్వసనీయత పై దెబ్బతుగులుంది. చేజేతులా వైసీపీని పవనే గెలిపించారని టీడీపీతో పాటు విపక్షాలు ఆరోపిస్తాయి. అది అసలుకే ఎసరు వస్తుంది. పోనీ 2024 ఎన్నికల్లో త్యాగానికి సిద్ధపడి.. 2029 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఢిల్లీ పెద్దలు వైట్ వాష్ చేసినా అది సాధ్యమేనా అన్న ప్రశ్న వెంటాడుతోంది. ఇప్పటికే మోదీ ప్రభ తగ్గుతోంది. మూడోసారి అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రజా వ్యతిరేకత రెట్టింపు అవుతోంది. ఇలా అన్నిరకాల విశ్లేషణలు చేసుకునే పవన్ రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.