Nandamuri Balakrishna : వచ్చే ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) సతీమణి వసుంధర పోటీ చేయనున్నారా? ప్రత్యక్ష రాజకీయాల్లో దిగనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం హిందూపురం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఆయన తన సినిమాల్లో బిజీగా ఉన్న నియోజకవర్గ విషయంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా.. హిందూపురంలో కార్యక్రమాలకు వాలిపోతుంటారు. రోజుల తరబడి అక్కడే గడుపుతుంటారు. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు ఉండడంతో.. సునాయాసంగా తన పని తాను చేసుకు పోతున్నారు బాలకృష్ణ. అయితే వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకొని.. భార్య వసుంధరకు అక్కడ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
* నారా భువనేశ్వరి ప్రత్యేక ట్రీట్
బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించడంపై ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ) సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని తన ఫామ్ హౌస్ లో ట్రీట్ ఇచ్చారు. కార్యక్రమానికి నందమూరి తో పాటు నారా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు వసుంధర దేవి గురించి చర్చించారు. బాలకృష్ణ తన భార్య వసుంధర కోసం టిక్కెట్ అడుగుతుంటారని.. ఆమెను మెప్పించడానికి అలా కోరుతున్నారో.. లేకుంటే నిజంగా అడుగుతున్నారో తెలియదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో వసుంధర దేవి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి ఉద్దేశ్యం ఉందని ప్రచారం ప్రారంభమైంది. అవసరం అయితే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
* నందమూరి కుటుంబానికి పెట్టని కోట
నందమూరి కుటుంబానికి హిందూపురం( Hindu Puram ) పెట్టని కోట. పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో టిడిపి జెండా ఎగురుతూ వస్తోంది. తొలినాళ్లలో నందమూరి తారక రామారావు హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు. అటు తరువాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ సైతం హిందూపురం నియోజకవర్గం వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2014లో తొలిసారిగా నందమూరి బాలకృష్ణ ఆ నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం నిలబడ్డారు నందమూరి బాలకృష్ణ. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే సినిమాలతో పాటు బుల్లితెరలో బిజీగా ఉన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో తాను తప్పుకొని భార్యకు అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది.
* నియోజకవర్గం సుపరిచితం
హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ( Balakrishna) ఉన్నారు. కానీ అక్కడ తరచూ పర్యటిస్తుంటారు ఆయన భార్య వసుంధర. పరామర్శలు, కార్యకర్తల బాగోగులు కూడా చూసుకుంటారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని ప్రతి పల్లె ఆమెకు సుపరిచితం. అందుకే ఈసారి బాలకృష్ణ తప్పుకుంటే తాను పోటీ చేయాలని వసుంధర భావిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి పునర్విభజన తో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ఆ సమయంలో బాలకృష్ణ తో పాటు నందమూరి వసుంధర పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని టిడిపి అవర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.