Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారా? బిజెపిలో చేరుతారా? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు తీసుకుంటారా? ఈ వార్తలో నిజం ఎంత? అది సాధ్యమేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు బలమైన చర్చ ఇది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు చిరంజీవి. తన సినిమాలు తాను చేసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూటమికి పరోక్ష మద్దతు తెలిపారు. జనసేనకు ఓటు వేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుమించి ప్రచారంలో కూడా పాల్గొనలేదు చిరంజీవి. కుటుంబ సభ్యులు సైతం మద్దతు వరకే పరిమితం అయ్యారు. నాగబాబు కుటుంబం మాత్రం ప్రచారంలో పాల్గొంది. అయితే నాగబాబు సైతం జనసేన సభ్యుడు కావడంతోనే అలా చేశారు. కానీ చిరంజీవి మాత్రం అంతలా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు అదే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని కొత్త ప్రచారం ప్రారంభం అయింది. అది కూడా బిజెపిలోకి వెళ్తారు అన్నది ప్రచార సారాంశం.
* ప్రజారాజ్యం ద్వారా ఎంట్రీ
2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ప్రజారాజ్యం( Praja Rajyam ) పార్టీని ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి.. తిరుపతిలో మాత్రమే గెలిచారు. అయితే నాడు త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాగలిగింది. ఓటమి తరువాత ప్రజారాజ్యం పార్టీని నడపడంలో చిరంజీవికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ పదవి తీసుకున్నారు చిరంజీవి. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 2014లో రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం అయ్యింది. దీంతో చిరంజీవి సైతం సైడు అయ్యారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాలు చేయడం ప్రారంభించారు. ఇక రాజకీయాల జోలికి వెళ్ళనని కూడా చాలా సందర్భాల్లో ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి.
* జగన్ తో సైతం సన్నిహితం
అయితే గత ఐదేళ్ల వైసిపి ( YSR Congress )పాలనలో జగన్మోహన్ రెడ్డికి సైతం సన్నిహితుడిగా ఉండేవారు. సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలను సైతం విన్నవించేవారు. ఈ క్రమంలో ఆయన పై కొందరు వైసీపీ నేతలు అప్పట్లో అనుచిత కామెంట్స్ చేశారు. జగన్ సైతం చిరంజీవిని అగౌరవపరిచారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో జనసేన టిడిపి తో పొత్తు పెట్టుకుంది. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. చిరంజీవి జనసేన కు మద్దతు ప్రకటించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా కూటమికి పరోక్షంగా మద్దతు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం చిరంజీవి హాజరయ్యారు. అక్కడి నుంచి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారు అంటూ ప్రచారం ప్రారంభం అయ్యింది.
* మెగా కుటుంబంతో రాజకీయం
అయితే తాజాగా మెగా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని బిజెపి( BJP) ఏపీలో రాజకీయం మొదలుపెట్టిందని ప్రచారం ప్రారంభం అయింది. బిజెపి రాష్ట్ర పగ్గాలు చిరంజీవికి అప్పగించడం ద్వారా ఏపీలో పార్టీని విస్తరించాలన్నది కేంద్ర పెద్దల ప్లాన్ గా ప్రచారం చేస్తున్నారు. అటువైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. బిజెపి అధ్యక్షుడిగా చిరంజీవిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటమే బిజెపి పెద్దల అసలు వ్యూహం అని టాక్ నడుస్తోంది. అయితే చిరంజీవి నుంచి మాత్రం ఆ సంసిద్ధత లేదు. పవన్ సైతం చిరంజీవి విషయంలో వేరే ఆలోచనతో ఉన్నారు. ఆయనను పెద్దరికంలో చూడాలని.. రాజకీయాలకు ఆయన సరిపోరు అన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. కానీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు.
* వారిద్దరికీ కాదని
ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా పురందేశ్వరి( purandeswari ) ఉన్నారు. ఆమె మరోసారి ఆ పదవి కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న ఏపీకి అమిత్ షా వచ్చినప్పుడు సైతం ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు ప్రచారం నడిచింది. అప్పట్లో చంద్రబాబు సైతం పురందేశ్వరికి రికమండ్ చేసినట్లు ప్రచారం ఉంది. ఆమె అయితే కూటమిలో సమన్వయానికి సరిపోతారని చంద్రబాబు బిజెపి అగ్రనేత దృష్టికి తీసుకెళ్లారని కూడా తెలుస్తోంది. ఒకవేళ ఆమె మార్పు అనివార్యం అయితే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ చీఫ్ పదవి ఇవ్వాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అయితే బిజెపి అగ్ర నేతలు మాత్రం చిరంజీవికి ఆ పదవి అప్పగించి టిడిపికి చెక్ చెపుతారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అటు చిరంజీవి కానీ.. ఇటు పవన్ కానీ దానిని సమ్మతించే ఛాన్స్ లేదు. అదంతా ఫేక్ ప్రచారమేనని తెలుస్తోంది.