Kinjarapu Ram Mohan Naidu: ఏపీలో మంచి వాగ్దాటి కలిగిన ఎంపీగా యువ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గుర్తింపు పొందారు. గత రెండుసార్లుగా శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తండ్రి ఎర్రన్నాయుడు అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు. మంచి వాగ్దాటితో, సమయస్ఫూర్తితో వ్యవహరించే రామ్మోహన్ నాయుడు తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ఎంపీగా గెలుపొందారు. తన పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. ఐదింట ఓడిపోయినా ఎంపీగా గెలిచారు. అందుకే ఆయన మూడోసారి తప్పకుండా విజయం సాధిస్తారు అన్న ధీమా ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ అసెంబ్లీ టికెట్ల వ్యవహారంలో జరిగిన దుమారంతో ఇప్పుడు కొత్త డౌట్ మొదలైంది.
తెలుగుదేశం పార్టీ మూడో జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నుంచి కొత్తగా గొండు శంకర్ కు అవకాశం ఇచ్చారు. అక్కడ మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి ఇన్చార్జిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచారు. 2019లో సైతం రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు.ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. దీంతో ఆమె భర్త,మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. అదే జరిగితే శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా ఓట్లు చీలే అవకాశం ఉంది.
పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ను మామిడి గోవిందరావుకు ఖరారు చేశారు.ఇక్కడ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఉన్నారు. దీంతో కలమట వెంకటరమణమూర్తి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కలమట వెంకటరమణమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ టిడిపిలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో కలమట వెంకటరమణమూర్తికి టిడిపి టికెట్ దక్కింది. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు కూడా టిడిపి టికెట్ ఆశించారు. కానీ గోవిందరావు దక్కించుకున్నారు. అయితే దీనంతటికీ కింజరాపు కుటుంబం కారణమని.. ఆగ్రహంతో ఉన్న కలమట ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. అదే జరిగితే ఓట్లు చీలిపోవడం ఖాయం.
అయితే తమకు సీటు దక్కక పోవడానికి కింజరాపు కుటుంబమే కారణమని ఆ ఇద్దరు నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాగైనా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్మోహన్ నాయుడును దెబ్బతీయాలని భావిస్తున్నారు. అందుకే ఆ రెండు నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చూస్తున్నారు. తద్వారా టిడిపి ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి దెబ్బతీయాలని భావిస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. గత ఎన్నికల్లో పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లకు గాను.. ఐదు చోట్ల టిడిపి ఓడిపోయింది. అయినా సరే ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. అప్పుడే ఏం చేయలేనిది.. ఇంతటి ప్రభుత్వ వ్యతిరేకత సమయంలో ఏం చేస్తారు అన్న ప్రశ్న టిడిపి శ్రేణుల నుంచి వినిపిస్తోంది. మొత్తానికైతే హ్యాట్రిక్ కొట్టాలన్న రామ్మోహన్ నాయుడు ప్రయత్నాన్ని ఆ ఇద్దరు నేతలు అడ్డుకుంటామని చెబుతున్నారు. అయితే ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందా? లేదా? అన్నది చూడాలి.