Pawan Kalyan Yuvashakti Sabha: ఏపీలో ఇప్పుడు జీవో 1 దుమారం రేగుతోంది. బ్రిటీష్ కాలం నాటి జీవోను తెరపైకి తెచ్చి జగన్ తన మార్కు రాజకీయం చూపిస్తున్నారు. ప్రతిపక్షాల దూకుడును కళ్లెం వేయాలని చూస్తున్నారు. అటు గిట్టని వారి సినిమా ఫంక్షన్లు అడ్డుకుంటున్నారు. అయితే తమ వారికి మాత్రం మినహాయింపు ఇచ్చుకుంటున్నారు. వందలాది మందితో ర్యాలీలుచేసినా.. మందీ మార్భలంతో హడావుడి చేసినా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర, జాతీయ రహదారులపై బలప్రదర్శనకు దిగినా పర్వాలేదు ప్రొసీడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే ఈ జీవో రాక మునుపే విపక్షాలు చాలా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. డేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నాయి. వాటన్నింటికీ ఇప్పుడు జీవో 1 లింకు కలిపి అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థంలో జనసేన యువశక్తి కార్యక్రమ నిర్వహణకు ప్లాన్ చేసింది. నెలల కిందట నుంచే సన్నాహాలు చేసుకుంటుంది. అయితే కార్యక్రమ నిర్వహణకు పోలీసుల అనుమతి లభించకపోవడంతో జన సైనికులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షం హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శిస్తున్నారు.

గత రెండు నెలలుగా యువశక్తి కార్యక్రమానికి జనసేన ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను ఒక వేదికగా తీసుకొచ్చి పవన్ దిశ నిర్దేశం చేయాలని భావించారు. అటు యువశక్తి కార్యక్రమ వివరాలను పోలీస్ శాఖకు తెలియజేశారు. అయితే డీజీపీ నుంచి ఎటువంటి స్పందన లేదని జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ చెబుతున్నారు. అసలు జనసేన అంటే ప్రభుత్వానికి ఎందుకు భయమని ప్రశ్నించారు. 175 సీట్లకు 175 వస్తాయనుకున్నప్పుడు విపక్షాలకు ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పింఛన్ల తొలగింపు విమర్శల నుంచి బయటపడేందుకే జీవో 1 తెరపైకి తెచ్చారని మనోహర్ ఆరోపించారు.

ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకు అడ్డుతగులుతున్నారు. జీవోను సాకుగా చూపి పోలీసులు అడ్డగిస్తున్నారు. దీంతో అందరి దృష్టి జనసేన యువశక్తిపై పడింది. చంద్రబాబు తరువాత పవన్ హాజరయ్యే రాజకీయ వేదిక కావడంతో ప్రభుత్వతప్పకుండా అవరోధాలు సృష్టిస్తుందని జన సైనికులు అనుమానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకూ కార్యక్రామానికి పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. జీవో రాక మునుపే యువశక్తి వివరాలు అందించినా పోలీసులనుంచి స్పందన లేకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ఆంక్షలు విధించే చాన్స్ ఉందన్న ప్రచారం ఉంది. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా జనసేన శ్రేణులు యువశక్తి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.