Homeఆంధ్రప్రదేశ్‌Film Industry AP: సినిమా రంగానికి ఆంధ్రాలో కష్టాలు

Film Industry AP: సినిమా రంగానికి ఆంధ్రాలో కష్టాలు

Film Industry AP: ఏదైనా తప్పు జరిగితే చుట్టూ ఉన్న వారు అడ్డుకోకపోవచ్చు.. అభ్యంతరం తెలపకపోవచ్చు. కానీ అదే తప్పు పదే పదే జరిగితే మాత్రం ప్రజాప్రతిఘటన ఎదురుకాక తప్పదు. ఇప్పుడు తెలుగునాట చిత్ర పరిశ్రమపై ‘అధికార’ జులుం అంతా ఇంతా కాదు. చివరకు నచ్చని వారు సినిమాల ఫంక్షన్లను అడ్డుకునేటంతగా, వారి సినిమా టిక్కెట్ ధరలు తగ్గించేటంతగా పరిస్థితి మారిపోయింది. మూడు రాజధానులతో ఏపీ సమగ్రాభివృద్ధి చేస్తామంటున్న జగన్ సర్కారు.. సినిమా రంగం ఏపీకి వస్తానంటే మాత్రం ఆహ్వానించడం లేదు. అందుకు తగ్గ వాతావరణం కల్పించడం లేదు. జీవో1 ను సాకుగా చూపి చిరంజీవి వాల్తేరు వీరయ్య, ఇటు బాలక్రిష్ణ వీరసింహారెడ్డి సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లకు అనుమతివ్వక పోవడం దేనికి సంకేతం. మొన్నటికి మొన్న చిరంజీవి పవన్ కు అనుకూల వ్యాఖ్యాలు చేశారని.. దాని పర్యవసానమే వాల్తేరు వీరయ్యకు ఇబ్బందులు అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు బాలక్రిష్ణ సైతం టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి, రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారని టాక్ తెలుగునాట వినిపిస్తోంది.

Film Industry AP
chiranjeevi, balakrishna

గతంలో తెలుగు రాజకీయాల్లో చాలా మంది సినీ నటులు కొనసాగారు. ఎన్నెన్నో పదవులు చేపట్టారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేవారు. అయితే ఏనాడూ సినిమాపై రాజకీయ ముద్రపడలేదు. అంతెందుకు నాడు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ ఉండేవారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండేవారు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సినిమాలు తీసిన సందర్భాలున్నాయి. రాజకీయంగా చికాకు తెప్పించే ఎన్నో సినిమాలను ప్రత్యర్థులు నిర్మించారు. అందులో తెలుగు సినీ ప్రముఖులే నటించారు. అలాగని పవర్ లో ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమాలపై కక్ష కట్టలేదు. కర్కశంగా వ్యవహరించలేదు. దశాబ్ద కాలం కిందట వరకూ సినిమాలపై రాజకీయ ప్రభావం అంతంతమాత్రమే. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నటించి కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాతో ఒక రకమైన విరుద్ధ వాతావరణం ఏర్పడింది. కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఉండడంతో బ్యాన్ చేయాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేశారు. అక్కడి నుంచి సినిమాలపై రాజకీయాలు ప్రభావం చూపుతునే ఉన్నాయి.

రాష్ట్రం వేరుపడినా సినిమా వాళ్లు మాత్రం హైదరాబాద్ నుంచి ఏపీ రావడం లేదన్న కామెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవుట్ డోర్ యూనిట్లలో షూటింగ్ చేయదలచుకున్న వారు విశాఖను ఎంచుకుంటున్నారు. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లకు విశాఖ, విజయవాడ, తిరుపతి వంటివి వేదికలుగా మారుతున్నాయి. ఇటువంటి తరుణంలో మరింత ప్రోత్సాహం అందించాల్సింది పోయి జగన్ సర్కారు రాజకీయ కారణాలతో ఏపీలో సినిమారంగ ప్రవేశాన్ని అడ్డుకుంటోంది. మొన్నటి వరకూ చిరంజీవి పట్ల అభిమానం చూపిన జగన్ అండ్ కో..ఆయన సోదరుడు పవన్ కు అనుకూలంగా ప్రకటించేసరికి పట్టరాని కోపం వచ్చేసింది. అందుకే జీవో నంబర్ 1 సాకుగా చూపి విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటుచేయదలచిన వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు అనుమతి నిరాకరించారు. ఆర్కే బీచ్ ఉన్నదే ఊరికి చివరున. అది కూడ ఎంటర్ టైన్ మెంట్ జోన్ లో ఉంది. గతంలో ఎన్నో సినిమా, వినోద కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. అటువంటి ప్రజాభద్రతకు అక్కడ తీరని విఘాతం అన్న కారణం చూపి అనుమతులు ఇవ్వడం లేదు.

Film Industry AP
Film Industry AP

 

బాలక్రిష్ణ వీరసింహారెడ్డి విషయంలో కూడా అదే రిపీట్అయ్యింది. సినిమా ఫ్రిరిలీజ్ ఈవెంట్ ను ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రాండ్ గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. కానీ అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం చుక్కలు చూపించింది. సంబంధిత చిత్ర ప్రతినిధులు కార్యాలయాల చుట్టూ తిరిగినా కనికరించలేదు. అయితే జగన్ అండ్ కో ఇక్కడే తప్పటడులు వేస్తున్నారు. చిరంజీవి, బాలక్రిష్ణ అభిమానులు సైతం వైసీపీకి ఓటు వేసి ఉంటారు. సినిమా స్టార్ గా వారిని అభిమానిస్తూనే పొలిటికల్ పార్టీగా వైసీపీని ఆదరించిన వారుంటారు. అంతెందుకు సీఎం జగన్ కూడా ఒకప్పుడు బాలక్రిష్ణ అభిమాన సంఘం ప్రతినిధి అన్న విషయం గుర్తించుకోవాలి. తనతండ్రి ఉన్న కాంగ్రెస్ పార్టీకే పని చేసిన విషయం గుర్తెరగాలి. సినిమాలను, స్టార్లను అభిమానించే వారు తనను ఆదరించకుంటే గత ఎన్నికల్లో అంతటి విజయం సాధ్యమయ్యేదా? ఇదే విషయాన్ని గుర్తెరిగి మసులుకుంటే జగన్ కు మంచిది. లేకుంటే సినిమావాళ్లకు ఏపీలో ఇబ్బందులు పెడితే ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular